ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌కు పెరుగుతున్న దరఖాస్తులు : మూడు జిల్లాల్లోనే ఎక్కువ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 'ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్' కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబ యజమాని మృతి చెందిన సందర్భాల్లో ఆ కుటుంబానికి చెందిన ఆస్తులు, ప్రభుత్వపరంగా, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రావాల్సిన ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగాలు పొందాలంటే ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ తప్పనిసరి. గతంలో అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈ తరహా సర్టిఫికెట్ ఉండేది. ప్రస్తుతం అన్నిటికీ అదే కావాలని అడుగుతుండటంతో దరఖాస్తులు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారిలో రెండో భార్య ఉంటే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటోందని, నిజమైన వారసులను తేల్చడం కష్టంగా ఉంటోందని, ఇటువంటి వాటిల్లో నకిలీ సర్టిఫికెట్లూ ఉంటున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే మొత్తం దరఖాస్తుల్లో 21.14 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్టిఫికెట్ కోసం 62,077 మంది దరఖాస్తులు చేసుకోగా, 41,580 దరఖాస్తులను క్లియర్ చేశారు. 13,332 తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో 7,169 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఎస్‌ఎల్‌ఎ పెండింగ్‌లో 4,837, సమయం దాటిపోయిన దరఖాస్తులు 2,332 ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు కూడా ఎక్కువగా మూడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. విశాఖపట్నంలో 38.65 శాతం, శ్రీకాకుళంలో 27.56 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 27.16 శాతం ఉన్నాయి. విచారణ గడువు ముగిసి పెండింగ్ పెట్టిన వాటిల్లో అన్నమయ్య జిల్లాలో 20.94 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14.78 శాతం, తిరుపతి జిల్లాలో 13.21 శాతం ఉన్నాయి.










