Jan 08,2023 14:38

రంగ, దినేష్‌, ఇమామ్‌, కామేష్‌, మేఘనాథం హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఒక రోజు రంగ వాళ్ళ చెరకు తోటలో చెరకుగడలు తెచ్చుకుందామని కాలినడకన పొలానికి బయలుదేరారు మిత్రులంతా. బడి వదలగానే సంక్రాంతి పండుగ సెలవలు ఎలా గడపాలో మాట్లాడుకుంటూ, వేరే కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా చెరకుతోటకు వెళ్తున్నారు. రోడ్డుమీద గుంతలు వర్షపు నీటితో నిండి వున్నాయి.
స్కూల్‌ నుంచి ఇంటికి సైకిల్‌ పైన వెళ్తున్న సాయి లోతైన గుంతలోకి సైకిల్‌ పోవడంతో అదుపు తప్పి, కింద పడిపోయాడు. తలకు గాయమై, రక్తం కారసాగింది. తనదగ్గరున్న జేబురుమాలుతో సాయి తలపైన కారుతున్న రక్తం తుడిచి, అలాగే అదిమి పట్టుకొన్నాడు డాక్టరు కొడుకు దినేష్‌. రైతు కొడుకు రంగ, సాయిని భుజంపై ఎత్తుకొని, 'ఆసుపత్రికి తీసుకెళదాం' అన్నాడు.
'మా నాన్న ఈ సమయంలో ఇంటిలోనే ఉంటాడు. ఆసుపత్రి అంటే చాలా దూరం. మా ఇంటికే వెళ్దాం' అన్నాడు దినేష్‌. రంగ వెనుకనే దినేష్‌ వెళ్తూ రక్తం కారకుండా జేబురుమాలు సాయి తలకు పెట్టి అలాగే పట్టుకొన్నాడు.
కింద పడ్డ సైకిల్‌ తీస్తూ 'అధికారులతో చెప్పి, గుంతలు మూయించమని చెబుతాను. మానాన్న ఇప్పుడు ఆఫీసులో వుంటారు. సైకిల్‌ సరిచేయించి, ఆఫీసుకు వెళ్లి మా నాన్నతో చెబుతాను. అలాగే ఈ సైకిల్‌ వాడింట్లో ఇచ్చి వస్తాను' అన్నాడు ఇంజినీరు కొడుకు ఇమాం.
'మా నాన్నతోనూ ఇంటికెళ్ళగానే చెబుతాను. అప్పటికీ పనవ్వకపోతే పోరాటం చేసైనా ఈ రోడ్లు సరిచేసేలా చేస్తా' అన్నాడు కార్మిక నాయకుడి కొడుకు కామేష్‌.
గుంపుగా వున్న పిల్లలందరూ రోడ్డుమధ్యలో గుంతను చూస్తూ 'గుంతలో నీరుండటం వలన లోతు లేదనుకొని వెళుతూ పడిపోయాడు పాపం' అంటూ జాలిగా చెప్పుకొనసాగారు.
మేస్త్రీ కొడుకు మేఘనాథం రోడ్డు పక్కకు వెళ్లి ఒక కొయ్యతో మట్టిని తవ్వుతూ కుప్పగా పేర్చి అక్కడే వున్న రాళ్లను కలిపి, చేతినిండా తీసుకొని వచ్చి గుంతలో వేయసాగాడు. 'మనం కూడా ఈ గుంతలు పూడ్చేద్దాం రండి' అంటూ పిల్లలవైపు చూస్తూ అని, మేఘనాథంతో చేతులు కలిపాడు కామేష్‌. ఇళ్లకు బయలుదేరిన పిల్లలు కొంతమంది సాయం చేశారు. మరికొంత సేపటికి వర్షపు నీటితో నిండిన గుంతలు మట్టి రాళ్లతో నిండిపోయాయి.
జరిగిన సంగతి తెలుసుకొన్న హెడ్‌ మాస్టర్‌ జయరామయ్యగారు మరుసటిరోజు ప్రేయర్‌లో పిల్లలను అభినందించారు. మిగిలిన పిల్లలందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని హితవు చెప్పారు.


ఓట్ర ప్రకాష్‌ రావు
09787446026