Sep 11,2022 09:46

న్యూఢిల్లీ : తమ సంస్థలో పనిచేసే ఉన్నత స్థాయి వ్యక్తుల మొబైల్‌ ఫోన్లను జప్తు చేశారని, సంస్థకు చెందిన ముఖ్యమైన డేటాను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని 'ఆక్స్‌ఫామ్‌ ఇండియా' తెలిపింది. రాజకీయ పార్టీలకు అక్రమంగా నిధులు సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ, ఈ నెల 7న ఆక్స్‌ఫాం ఇండియాకు చెందిన 'సిపిఆర్‌', 'ఐపిఎస్‌ఎంఎఫ్‌' కేంద్రాలపై ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడిందని, అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపిందని.. తదితర ఆరోపణలపై విచారణ జరపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఐటి శాఖను ఆదేశించింది. ఐటి శాఖ దాడుల అనంతరం ఆక్స్‌ఫాం ఇండియా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశ చట్టాలను తాము గౌరవిస్తున్నామని, రాజకీయ కక్షసాధింపు వైఖరితోనే తమపై ఐటి దాడులు జరిగాయని ఆక్స్‌ఫాం తెలిపింది. సంస్థకు చెందిన కంప్యూటర్‌ సర్వర్లు, మొబైల్‌ ఫోన్లను జప్తు చేశారని తెలిపింది. ''ఐటి దాడులు జరిగిన సమయంలో 35 గంటలపాటు నాన్‌స్టాప్‌గా సంస్థ సభ్యుల్ని బయటకు వెళ్లకుండా ఆపేశారు. ఇంటర్నెట్‌ ఆపేశారు. మొబైల్‌ ఫోన్లు జప్తు చేశారు. మా సంస్థకు చెందిన వందల పేజీల డేటాను ఐటి అధికారులు తీసుకెళ్లారు. సంస్థలో సీనియర్‌ లీడర్‌షిప్‌, టీం సభ్యుల మొబైల్‌ ఫోన్లను క్లోనింగ్‌ చేసి.. మొత్తం డేటాను తీసుకున్నారు'' అని తెలిపింది. భారతీయ చట్టాలను గౌరవిస్తూ, ఐటి, ఎఫ్‌సిఆర్‌ఎ రిటర్న్‌లతో సహా అన్ని చట్టబద్ధమైన సమ్మతులను సకాలంలో దాఖలు చేశామని ఆక్స్‌ఫాం పేర్కొంది.