Oct 14,2023 21:29

తెలీని విషయం కోసమో.. వస్తువు కొనుగోలు కోసమో.. నిత్యం సెర్చింజన్లపై మనం ఆధారపడుతుంటాం. వీటిని ఉపయోగించే సమయంలో మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కేటుగాళ్లకు చిక్కినట్లే. దీంతో మీకు తెలియకుండా మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుతుంది. మీ అనుమతి లేకుండానే మీ వ్యక్తిగత వివరాలను అనేక మార్గాల ద్వారా సంపాదిస్తుంది.
మనం ఏదైనా విషయం గురించి వెతికినప్పుడు మనకు 'స్పాన్సర్డ్‌' పేరిట తొలుత కొన్ని వెబ్‌పేజీలు కనిపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్లతో పాటు స్కామర్లూ వీటిని కొనుగోలు చేసే వీలుంది. అందుకే వారి వెబ్‌పేజ్‌లు కూడా అగ్రస్థానంలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కేటుగాళ్లు క్రియేట్‌ చేసే వెబ్‌పేజ్‌లో మాల్‌వేర్‌తో ఉంటాయి. ఈ విషయం తెలియకుండా ఆ వెబ్‌పేజీ వినియోగిస్తే.. మన వ్యక్తిగత సమాచారాన్ని వారి చేతికి అందించినట్లే అవుతుంది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలంటే ఈ కింది టిప్స్‌ ఫాలో అయిపోండి.
సులువుగా డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలను చాలా మంది ఆన్‌లైన్‌లో అన్వేషిస్తుంటారు. సరిగ్గా ఇలాంటివే సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున బోనస్‌లు, అధిక మొత్తంలో సంపాదించవచ్చంటూ కేటుగాళ్లు ఊరిస్తుంటారు. ఇలాంటి ఆఫర్లు వాస్తవానికి దూరంగా అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సైబర్‌ మోసాల వలలో పడొద్దు.
కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం సెర్చ్‌ ఇంజిన్‌ సాయంతో వెతికినప్పుడు ఫేక్‌ నంబర్లు కూడా దర్శనమిస్తుంటాయి. బిజినెస్‌ సంస్థలు, కంపెనీలు ఇలా ఎవరి నంబర్లు కావాలన్నా వారి అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవడమే మంచిది.
సిబిల్‌ స్కోర్‌, సిబిల్‌ రిపోర్ట్‌ ఉచితంగా తెలుసుకోవచ్చంటూ అనేక ఫేక్‌ వెబ్‌సైట్లు కనిపిస్తుంటాయి. వీటిని వినియోగించకపోవటమే మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించిన క్రెడిట్‌ బ్యూరోల ద్వారా మాత్రమే క్రెడిట్‌ స్కోర్‌ను తెలుసుకోండి.