Oct 18,2023 15:27

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లోనే బీజం పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. 'కొత్త రాష్ట్రం తెలంగాణను రెండుసార్లు కేసీఆర్‌ చేతుల్లో పెట్టారు. బిఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలి. కరీంనగర్‌లో ఎన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామో చూడండి. కరీంనగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడ చూసినా జలకళే కనిపిస్తోంది. బిజెపి, కాంగ్రెస్‌ను గెలిపిస్తే 50 ఏళ్లు వెనక్కి వెళ్తాం.బిఆర్‌ఎస్‌ పాలనలో పల్లెలు బాగుపడుతున్నాయి. గిరిజన తండాల్లో రోడ్లు వస్తున్నాయి. కరెంటు ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ రూ.5 వేలు చేస్తాం. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. చదువుకుంటామనే పిల్లలకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నాం' అని కేటీఆర్‌ వివరించారు. మరోవైపు కరీంనగర్‌ నుంచి గెలిచిన ఎంపీ ఈ ఐదేళ్లలో ఏదైనా పని చేశారా?అని కేటీఆర్‌ నిలదీశారు. గంగుల కమలాకర్‌పై పోటీ అంటేనే అందరూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో పోటీ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్‌, బిజెపి నేతలకు తెలుసనని బిఆర్‌ఎస్‌ గెలుపుపై కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.