కోల్‌కత : కరీబియన్ పర్యటనలో భారత టెస్టు జట్టుకు అజింక్య రహానె వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుమారు 18 నెలలు జాతీయ జట్టుకు దూరమైన అజింక్య రహానె.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన రహానెకు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్రమోషన్ లభించింది. ఏడాదిన్నర పాటు అవసరం లేదని పక్కనపెట్టిన ఆటగాడికి పునరాగమనంలోనే వైస్ కెప్టెన్సీ అందించడానికి వెనుక ఉన్న కారణాలు నాకు అర్థం కాలేదని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. గురువారం కోల్‌కతలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గన్న గంగూలీ చర్చాగోష్టిలో మాట్లాడారు. 'యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వంటి వారిని నాయకత్వ గ్రూప్‌లోకి తీసుకోవాలనే ఆలోచనతో ఏకీభవిస్తాను. రహానెను 18 నెలలు పక్కనపెట్టారు. ఇప్పుడు పునరాగమనంలో వైస్ కెప్టెన్‌ను చేశారు. దీని వెనుక సెలక్షన్ కమిటీ ఆలోచనలు నాకు అర్థం కాలేదు. సెలక్షన్ కమిటీ నిర్ణయాలు ఎప్పుడూ హాట్ అండ్ కోల్డ్ తరహాలో ఉండకూడదు. జట్టు ఎంపికలో నిలకడ, కొనసాగింపు అవసరం.జట్టులో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నాడు. టెస్టు జట్టులో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించాల్సిందని' గంగూలీ అన్నాడు.
ఇక చతేశ్వర్ పుజారాను తప్పించటం వెనుక సెలక్షన్ కమిటీ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. వందకు పైగా టెస్టులు ఆడిన సీనియర్ ఆటగాడిని తప్పించాలనుకున్నప్పుడు ఆ సమాచారం స్పష్టంగా తెలియజేయాలి. పుజారా వంటి ఆటగాడిని ఇప్పుడు తప్పించి, మళ్లీ జట్టులోకి తీసుకోవటం సరికాదు. ఇదే రూల్ అజింక్య రహానెకు సైతం వర్తిస్తుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ విషయం స్పష్టం చేసి.. ముందుకు సాగాలి. సీనియర్ ఆటగాళ్లతో సెలక్షన్ డైలామా ఉండకూడదు. ఇక సర్ఫరాజ్ ఖాన్ పేస్ బౌలింగ్‌ను ఆడలేడనే వాదనలో నిజం లేదు. పేస్‌ను ఎదుర్కోలేనిదే.. రంజీ ట్రోఫీలో ఇన్ని పరుగులు చేయలేడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ దేశవాళీలో గొప్ప ప్రదర్శన చేశాడు. సెలక్షన్ కమిటీ జైస్వాల్‌ను ఎంపిక చేసి మంచి పని చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌కు సైతం సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించాలని గంగూలీ పేర్కొన్నాడు.










