విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు సన్నద్ధం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:విశాఖపట్నంలో కార్యాలయాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సిఎం క్యాంపు కార్యాలయంతోపాటు వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసేదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఎవరికి ఎంత విస్తీర్ణంలో కార్యాలయాలు అవసరమో వెంటనే తెలపాలని కోరుతూ ప్రభుత్వ కార్యదర్శి పోలా భాస్కర్ శుక్రవారం అనఫిషియల్ నోటు నెంబరు 2237565/ Ser.A/A1/2023-1ను జారీచేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి ప్లానింగు డిపార్టుమెంటు నోడల్ ఏజెన్సీగా ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు. 17వ తేదీలోపు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలనీ ఆదేశించారు. మంత్రుల కార్యాలయాలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు, విభాగాల అధిపతులు వెంటనే దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలనీ సూచించారు. ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుందనీ, దీనికి అనుగుణంగా విశాఖపట్నంలో బస చేయాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. దీనికి వీలుగా అక్కడ (ట్రాన్సిట్ అకామిడేషన్) కార్యాలయాల ఏర్పాటు కూడా వెంటనే చేసుకోవాలని సూచించారు. జిఓ 2015 ఆధారంగా అధికారులు, మంత్రులకు వేర్వేరుగా ప్రొఫార్మా పంపించారు. అధికారులకు పంపిన ప్రొఫార్మాలో ఇప్పటికే భవనం గుర్తించారా ? గుర్తిస్తే అడ్రస్, ఎంత విస్తీర్ణంలో ఉంది అనే వివరాలు తెలపాలని కోరారు. దీనిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాల అధిపతులకు ఎంతెంత కావాలో స్పష్టంగా తెలపాలని కోరారు. ఒకవేళ గుర్తించకపోతే ఎంత విస్తీర్ణంలో కావాలో తెలపాలని సూచించారు. మంత్రులకు పంపిన ప్రొఫార్మాలోనూ ఇదే తరహా సమాచారం కోరారు. దీన్ని విశాఖపట్నం ట్రాన్సిట్ అకామిడేషన్‌గా పేర్కొన్నారు.
వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి పేరుతో విశాఖకు కార్యాలయాలు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రుషికొండ మీద ఈ వారంలో సిఎం సతీసమేతంగా పూజలు నిర్వహించి కార్యాలయాలు, నివాసాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది.










