Sep 26,2023 16:16

తెలంగాణ: తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని చెప్పింది.మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో బుధవారం నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేటతో పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.