Sep 10,2022 07:50
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ముక్కాంలో 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
  • వరద నీటితో కృష్ణా నది ఉధృతి
  • దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరంపై తీవ్ర అల్పపీడనం
  • రాగల 36 గంటల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం
  • సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక

ప్రజాశక్తి- యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్రాంధలో పలుచోట్ల శుక్రవారం భారీ వర్షాలు పడ్డాయి. రాయలసీమలో తేలికపాటి జల్లులు కురిశాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీరంలో సముద్రం 50 మీటర్ల వరకూ ముందుకు వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాగల 36 గంటల్లో ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డ్యూటీ అధికారి హైమారావు తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎర్ర కాలువ ప్రాజెక్టుకు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో, తాడేపల్లిగూడెం మండం నందమూరు, వీరంపాలెం, అప్పారావుపేట గ్రామాల్లో పంట పొలాలు ముంపుబారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ రెండు జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న రొయ్యలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మోరంపూడి సెంటర్‌, కంబాల చెరువు, తుమ్మలోవ, తాడితోట సెంటర్లు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలో మండపేట, రామచంద్రపురం, అంబాజీపేట, కొత్తపేట, మామిడికుదురులో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కాకినాడ జిల్లాలో కచేరిపేట ముంపునకు గురైంది. గొల్లప్రోలులో సుద్దగడ్డ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీరంలో 50 మీటర్ల వరకు సముద్రం ముందుకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒడిశాలో కురుస్తోన్న వర్షాలతో నాగావళి నదికి వరద ప్రవాహం పెరిగింది. శ్రీకాకుళం పాత వంతెన వద్ద 29 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వంశధారకు 7,724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. సీలేరు, కొయ్యూరు, ముంచంగిపుట్టు, పాడేరు, జికె.వీధి, విఆర్‌.పురం, కూనవరం, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో ఒక మోస్తరు వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని పది మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో జల్లులు పడ్డాయి.
 

                                         శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీలకు కొనసాగుతున్న వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 3,84,434 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,79,630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 885 అడుగులు నమోదైంది. నాగార్జున సాగర్‌ జలాశయానికి 3.93 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండగా, అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. దీని గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులు నమోదైంది. పులిచింతలకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గుంటూరు, ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

           ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం : విశాఖ వాతావరణ కేంద్రం అధికారి హైమారావు వెల్లడి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల ఎనిమిదిన ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం వద్దగల ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంపై తీవ్ర అల్పపీడనంగా బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డ్యూటీ అధికారి హైమారావు తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అల్పపీడనం ఈ నెల 11వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రపదేశ్‌ తీరానికి దగ్గర ఉన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద మరింతగా బలపడనుందని చెప్పారు. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు మూడు చోట్ల కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుందని చెప్పారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, మత్స్యకారులు తీరప్రాంతం, సముద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ భారీ వర్షాలు పలుచోట్ల ఈ ప్రభావంతో సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు.