- వైసిపి, టిడిపి పరస్పర ఆరోపణలు
ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. టిడిపి, వైసిపి శ్రేణులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, కేసులు పెట్టుకోవడం, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో రెండో రోజూఉద్రిక్తతలు కొనసాగాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరుల సమావేశం పెట్టి చంద్రబాబుకు సవాల్ విసరగా, టిడిపి నాయకులు ప్రతి సవాల్ విసిరారు.
నిలువరించే ప్రయత్నం చేశాం : మార్కాపురం డిఎస్‌పి
యర్రగొండపాలెంలో ఘటనను నిలువరించేందుకు ప్రయత్నించామని మార్కాపురం డిఎస్‌పి డాక్టర్ కిశోర్‌కుమార్ తెలిపారు. యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసిపి కార్యకర్తలు శాంతి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైసిపి కార్యకర్తలకు హితబోధ చేశామన్నారు. అదే తరుణంలో యర్రగొండపాలెం నుంచి మంత్రి కార్యాలయం వైపు వస్తున్న టిడిపి కార్యకర్తలను కట్టడి చేశామని తెలిపారు. చంద్రబాబునాయుడు బోడిరెడ్డిపల్లి జంక్షన్ నుంచి మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం దగ్గరకు రావడంతో అక్కడే వేచి ఉన్న టిడిపి కార్యకర్తలు కూడా ఆ కాన్వారుతో కలిశారన్నారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసు బలగాలతో కట్టడి చేశామని చెప్పారు. అయినా, రాళ్లు రువ్వుకున్న ఘటనలో టిడిపి, వైసిపి కార్యకర్తలకు గాయాలైనట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు టిడిపిపై ఒక కేసు, వైసిపిపై ఒక కేసు నమోదు చేశామని చెప్పారు. సభ నిర్వహించడానికి ఒకచోట అనుమతి తీసుకొని అక్కడ కాకుండా ఎన్‌టిఆర్ బొమ్మ సెంటర్‌లో నిర్వహించడంతో సభ నిర్వహణకు అనుమతి తీసుకున్న వారిపైనా కేసు నమోదు చేశామని తెలిపారు. ఎన్‌ఎస్‌జి అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పారు.
వైసిపి రౌడీ మూకలను శిక్షించాలి : ఎఎస్‌పికి టిడిపి వినతి
చంద్రబాబు కాన్వారుపై దాడికి పాల్పడిన వైసిపి రౌడీ మూకలను శిక్షించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఎఎస్‌పికి నాగేశ్వరరావుకు ఒంగోలులో టిడిపి ముఖ్య నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వీరిలో టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయస్వామి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, దివి శివరాం, తెలుగు యువ నాయకులు దామచర్ల సత్య ఉన్నారు.
చంద్రబాబుపై దాడికి సిపిఎం ఖండన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకులు రాళ్ల దాడి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన్ను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. స్వయంగా కేబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి చొక్కా విప్పి నిరసనలు తెలపడం, రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబుపై దాడి జరిగిందని తెలిపారు. ఇటువంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల సభలకు భద్రత కల్పించడంతోపాటు సొంత పార్టీవారు రెచ్చగొట్టకుండా అదుపులో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని శ్రీనివాసరావు అన్నారు.
చంద్రబాబే రెచ్చగొట్టారు : ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : మంత్రి సురేష్
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వేలు చూపించి, వైసిపి కార్యకర్తలను, ఎస్‌సి నాయకులను చంద్రబాబు దూషించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడ్డానని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. ఒక్క సెంటు భూమి ఆక్రమించినట్లు రుజువు చేసినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి సురేష్ సవాల్ విసిరారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టి మా మీదకు ఉసి గొల్పడం వల్లే ఘర్షణ చోటుచేసుకుందన్నారు. కావాలనే వైసిపి కార్యాలయం వద్ద చంద్రబాబు తన కారు ఆపి రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. రాళ్ల దాడిలో ముగ్గురు వైసిపి కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. దాడికి సంబంధించిన ఓ వీడియోను ఆయన మీడియా ముందు ఉంచారు. దాడి చేసిన వారిని గుర్తించామని, శుక్రవారం రాత్రే పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్ (ఐజి)కు ఫిర్యాదు చేశామని తెలిపారు. చంద్రబాబుపైనా, రాళ్లదాడికి పాల్పడిన వారిపైనా కేసులు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.
దళితులకు క్షమాపణ చెప్పే వరకూ చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీస్తాం : మంత్రి మేరుగ నాగార్జున
దళితులకు క్షమాపణ చెప్పే వరకూ చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీస్తామని, దళితులను భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, వైసిపి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, మొండితోక అరుణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. యర్రగొండపాలెంలో దళితులపై చంద్రబాబు దాడి చేయించారని, దళితులే చంద్రబాబుపై దాడులు చేశారంటూ చంద్రబాబు అండ్ బ్యాచ్ ఎదురు దాడి చేస్తోందని ఆరోపించారు. పథకం ప్రకారమే చంద్రబాబుపై రాళ్ల దాడి : అచ్చెన్నాయుడు ఒక పథకం ప్రకారమే టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ దాడి స్క్రిప్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఐ-ప్యాక్ రచించాయని విమర్శించారు. రూట్ మ్యాప్ తెలుసుకొని మరీ దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కీలకపాత్రని, వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని తెలిపారు. చంద్రబాబుపై దాడి చేయించేందుకు దళితులను ముఖ్యమంత్రి జగన్ పావులుగా వాడుకున్నారని కె.అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కెఎస్ జవహర్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు వ్యతిరేకంగా జరిగిన దాడులు, అరాచకాలకు నిరసనగా సురేష్ చొక్కా విప్పితే దళితులు హర్షించేవారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగినా నోరు మెదపని దళిత ద్రోహి మంత్రి సురేష్ అని టిడిపి ఎస్‌సి సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు విమర్శించారు. ఎర్రగొండపాలెం ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు కుమార్ భల్లాకు టిడిపి లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు.










