Feb 24,2023 22:07

వందకు పైగా యావరేజ్‌ నమోదు చేసిన తొలి క్రికెటర్‌
వెల్లింగ్టన్‌: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ హ్యారీ బ్రూక్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించలేని రికార్డును నెలకొల్పాడు. కేవలం ఆరు టెస్టులు ఆడిన బ్రూక్స్‌.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీల సాయంతో 807పరుగులు చేసి 100.88కు పైగా యావరేజ్‌తో టెస్ట్‌ బ్యాటర్స్‌లో ఎవరూ సాధించలేని ఫీట్‌ను నమోదు చేశాడు. దీంతో 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో.. ఓ క్రికెటర్‌ ఆడిన తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది వందలకు పైగా పరుగులు కొట్టిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉన్న రికార్డును తిరగరాసాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమైన రెండో టెస్ట్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 315పరుగులు చేసింది. గ్రూక్స్‌(184), రూట్‌(101) క్రీజ్‌లో ఉన్నారు. 107 బంతుల్లో సెంచరీ కొట్టిన బ్రూక్‌.. ఆ తర్వాత 62 బంతుల్లోనే 84 పరుగులు చేసాడు. బ్రూక్‌ారూట్‌ కలిసి నాల్గో వికెట్‌కు ఇప్పటికే 294 పరుగులు జోడించారు.
హ్యారీ బ్రూక్‌ను ఐపిఎల్‌ మినీ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ రూ.13.25 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.