ప్రజాశక్తి - తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం హనుమంత వాహనసేవలో టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు చెందిన పది కళాబృందాలలో 275 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన చెన్నమేళం (కేరళ డ్రమ్స్) బృందంలో 25 మంది కళాకారులు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. అదేవిధంగా 25 మంది మహిళలు కేరళ సంప్రదాయ వస్త్రధారణతో తిరువాతరకలై నృత్యం చేస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన శ్రీ భరత కళా అకాడమికి చెందిన 30 మంది యువతులు శ్రీ కృష్ణవైభవం నృత్యం ప్రదర్శించారు. రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మి గణేశ భజన మండలికి చెందిన 25 మంది యువతుల జానపద నృత్యం, తిరుమల శేష భజన మండలికి చెందిన 25 మంది కళాకారులు నవ దుర్గల వేషధారణలో దేవిస్త్రోత్రానికి అనుగుణంగా నత్యం ప్రదర్శించారు. అనంతపురానికి చెందిన 15 మంది అన్నమయ్య కీర్తనలకు భరతనాట్యం ప్రదర్శించారు.
ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల అన్నప్రసాదాల వితరణ
అలిపిరి నుంచి తిరుమలకు నడిచివెళ్లే యాత్రికులకు ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రా బ్యాంకు ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ బ్యాంకులో పదవీ విరమణ పొంది తిరుపతి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు తిరుమలకు కాలిబాట మార్గంలో వెళ్లే యాత్రికులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి కష్ణ, మునుగోటి కష్ణ మూర్తి, మునిరత్నం నాయుడు, శ్రీకాంత్ పాల్గొన్నారు. అదేవిధంగా గోవింద సేవా మండలి సభ్యులు అలిపిరి వద్ద యాత్రికులు అన్నప్రసాదాలను వితరణ చేశారు.










