న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మరో 5 జిల్లాల్లో బంగారం నగలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కొత్తగా 55 జిల్లాల్లో ఈ మార్కింగ్‌ను తప్పనిసరి చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 9 జిల్లాలను చేర్చింది. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 12 జిల్లాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాలను చేర్చింది. రాష్ట్రంలో ఇది వరకు ఈ నిబంధన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఉండగా.. తాజాగా అన్నమయ్య, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్‌టిఆర్, నంద్యాల జిల్లాలను ఈ జాబితాలోకి తీసుకొచ్చింది. తెలంగాణలో ఇది వరకు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే ఈ నిబంధన పరిధిలో ఉండగా.. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి, నల్గండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను చేర్చింది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనల్ని ప్రకటించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించగా.. మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తాజాగా మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
హాల్ మార్క్ అంటే...?
బంగారు నగల స్వచ్ఛతను హాల్‌మార్క్ నిర్దారిస్తుంది. హాల్‌మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధృవీకరణ గుర్తింపు 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బిఐఎస్) వ్యవహరిస్తోంది. కొత్త హాల్‌మార్క్‌లో నగలపై మూడు గుర్తులు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో త్రిభూజాకారంలో ఉండే బిఐఎస్, బంగారం స్వచ్ఛత తెలియజేసే 18 శాతం, 22 శాతం ముద్ర, ఆరు అంకెలు గల అల్పాన్యూమరిక్ కోడ్ హెచ్‌యుఐడి ఉంటుంది. హెచ్‌యుఐడితో బిఐఎస్ కేర్‌యాప్‌లో ఆ నగకు సంబంధించిన వివరాలు తనిఖీ చేసుకోవడానికి వీలుంటుంది.










