Sep 05,2023 14:28

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరోబిక్స్‌ ట్రైనర్‌ నూరుద్దీన్‌ను ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ.. చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతిఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనిషి పుట్టినప్పటినుంచి మరణించేదాకా ప్రతి అడుగులోను, ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడని, అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు ఉంటాడన్నారు. మార్గదర్శకుడిగా ఉంటూ వ్యక్తిత్వ వికాసానికి, శారీరిక వికాసానికి ఎదుగుదలకు ఎన్నో సూచనలు చేయటం అభినందనీయమన్నారు. మార్గదర్శకులుగా ఉంటూ అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు చిరుమామిళ్ల చిన్ని, పెసరమల్లి శేఖర్‌ మాస్టర్‌, దుబారు కరిముల్లా, ఖలీల్‌ అహ్మద్‌ రజ్వీ, మన్నెం దాసు, పిల్లి జయరాజు తదితరులు పాల్గొన్నారు .