Apr 22,2023 22:15

హైదరాబాద్‌ :గుజరాత్‌ టైటాన్స్‌ లఖ్‌నవూ ముందు ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే తరుణంలో చివరి ఓవర్లలో చాకచక్యంగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్కంఠ పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 7 పరుగుల తేడాతో గుజరాత్‌ విజయం సొంతం చేసుకుంది. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకునే క్రమంలో తడబడిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. లఖ్‌నవూ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (68) అర్ధ శతకంతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. కైల్‌ మేయర్స్‌ (24), కృనాల్‌ పాండ్య (23) మెరుపులు వృథా అయ్యాయి. నికోలస్‌ పూరన్‌ (1) విఫలమయ్యాడు. గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ రెండు, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వృద్ధీమాన్‌ సాహా (47), హార్దిక్‌ పాండ్య (66) రాణించారు. మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. శుభ్‌మన్‌ గిల్‌ (0), అభినవ్‌ మనోహర్‌ (3), విజయ్ శంకర్‌ (10), మిల్లర్‌ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్‌ పాండ్య, స్టాయినిస్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా అమిత్‌ మిశ్రా, నవీన్‌ ఉల్‌ హక్‌ ఒక్కో వికెట్‌ తీశారు.