తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం (రేపు) నిర్వహించనున్న రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 1019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది. ఇప్పటికే ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుంది.
పరీక్ష ప్రారంభానికి 15 నిముషాలు ముందే గేట్లు మూసేస్తాం : టీఎస్‌పీఎస్సీ
పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లు, వసతులు తదితర విషయాలను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలి.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : సిఎస్ శాంతికుమారి
గ్రూప్-1 నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 పరీక్షలు... సుపరిపాలన, సాహిత్య దినోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా, రెవిన్యూ డివిజన్లలో, మండల కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం సాహిత్య దినోత్సవం సందర్భంగా జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ కార్యక్రమాల్ని నిర్వహించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్...
అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలు ఉండే ప్రాంతాల వైపు అదనపు బస్సులు తిప్పనున్నది. హైదరాబాద్ సహా మిగిలిన నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుస్తు చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో జరిగే తొలి గ్రూప్-1కు అనూహ్య స్పందన లభించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే.. ప్రస్తుతం తెలంగాణలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. 503 పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేశారు.
2.75 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్...
గ్రూప్-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షను రద్దుచేసిన కమిషన్ ఆదివారం పున్ణపరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 2.75 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటుచేసింది. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్ జరుగుతుందని పేర్కొన్నాయి.
గ్రూప్-1కు దరఖాస్తులు ఇలా...
గ్రాడ్యుయేట్లు : 2,53,369
పోస్టు గ్రాడ్యుయేట్లు : 1,22,826
ఇంటిగ్రేటెడ్ (డిగ్రీ ం పీజీ) : 1,781
ఎంఫిల్ : 424
పీహెచ్‌డీ : 1,681
మొత్తం : 3,80,081










