Jul 15,2023 10:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధుల వివరాలను కమిషన్‌ తన వెబ్‌సైట్‌ www.psc.ap.gov.in లో పొందుపరిచింది. ఈ మేరకు ఎపిపిఎస్‌సి కార్యదర్శి జె ప్రదీప్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 సెప్టెంబర్‌ 30న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు 1,26,229 మంది దరఖాస్తు చేసుకోగా, 6,455మంది అర్హత సాధించారు. వీరిలో 5028 మంది అభ్యర్ధులు జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున మొత్తం 220 మంది అభ్యర్ధులను ఎపిపిఎస్‌సి ఎంపిక చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో 39 మందిని ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 27వ తేదిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను ఎపిపిఎస్‌సి నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ ఆథారిటీ(శాప్‌)కు జాబితాను పంపుతుంది. శాప్‌ పంపిన స్కోర్స్‌ను బట్టి ఎపిపిఎస్‌సి వీరిలో మరో ఇద్దరిని ఎంపిక చేస్తుంది. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఆగస్టు 2వ తేదిన ఎపిపిఎస్‌సి కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్ధులు వయస్సు, అర్హత, స్టడీ సర్టిఫికేట్‌, రెసిడెన్సి సర్టిఫికేట్‌, స్థానిక, కుల ధృవీకరణ, ఈడ బ్ల్యూఎస్‌ సర్టిఫికేట్లతో ఇంటర్య్వూలకు హాజరు కావాలని కార్యదర్శి వెల్లడించారు.