ప్రజాశక్తి -చాపాడు (కడప) : గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించిన మైదుకూరుకు చెందిన రైతు బిడ్డ పావనికి పలువురు నుంచి అభినందనల వెల్లువలు వస్తున్నాయి. శుక్రవారం మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జీ పుట్టా సుధాకర్ యాదవ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాక మాజీ కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి లు, మరికొంతమంది ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... మైదుకూరు పట్టణానికి చెందిన భూమిరెడ్డి గంగయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె పావని గ్రూప్ -1 లో రాష్ట్ర స్థాయిలో 2 ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికై జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టడం ఆనందదాయకమని అన్నారు. పావనిని శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ధనపాల జగన్, దాసరి బాబు, అన్నవరం సుధాకర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, పాల్గొన్నారు.










