Apr 19,2023 09:54
  • సన్‌రైజర్స్‌పై 14పరుగుల తేడాతో ముంబయి గెలుపు

హైదరాబాద్‌ : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 192పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 19.5ఓవర్లలో 178పరుగులకు కుప్పకూలింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి శుభారంభం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(28) జట్టు స్కోర్‌ 41పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్‌, గ్రీన్‌ కలిసి 2వ వికెట్‌కు 46పరుగులు జతచేశారు. ధాటిగా ఆడే క్రమంలో ఇషాన్‌ కిషన్‌(38; 31బంతుల్లో 3ఫోర్లు 2సిక్సర్లు) ఔటైనా.. గ్రీన్‌(64నాటౌట్‌; 40బంతుల్లో 6ఫోర్లు 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(7) మరోసారి నిరాశపరిచినా.. తిలక్‌ వర్మ(37; 17బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) ధాటిగా ఆడాడు. చివర్లో టిమ్‌ డేవిడ్‌(16; 11 బంతుల్లో 2ఫోర్లు) ఫర్వాలేదని పించాడు. జెన్సెన్‌కు రెండు, భువనేశ్వర్‌, నటరాజన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్‌ బ్రూక్‌(9) నిరాశపరిచినా.. మయాంక్‌ అగర్వాల్‌(48) బ్యాటింగ్‌లో రాణించాడు. ఆ తర్వాత క్లాసెన్‌(36), కెప్టెన్‌ మార్‌క్రమ్‌(22) మాత్రమే బ్యాటింగ్‌లో మెరిసారు. త్రిపాఠి(7), అభిషేక్‌ శర్మ(1), అబ్దుల్‌ సమద్‌(9) నిరాశపరిచారు. దీంతో సన్‌రైజర్స్‌ 19.5 ఓవర్లలోనే ఆలౌటైంది. ముంబయి బౌలర్లు బెహ్రెన్‌డార్ఫ్‌, మెరిడిత్‌, చావ్లాకు రెండేసి, అర్జున్‌ టెండూల్కర్‌, గ్రీన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కేమరూన్‌ గ్రీన్‌కు లభించింది.
 

table