ఆమోదిస్తే దెబ్బతిననున్న 'తాండవ' ఆయకట్టు!
ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన పంప్డ్ స్టోరేేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకోవడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఒసి) కోసం జలవనరుల శాఖ, అటవీ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. ఈ ప్రాజెక్టును పరిశీలించి ఎన్‌ఒసి ఇచ్చేందుకు సరిపడా గడువు కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం జలవనరుల శాఖకు చింతపల్లి మండలం యర్రవరంలోని ప్రతిపాదిత హైడల్ పవర్ ప్రాజెక్టుపై ఎన్‌ఒసి ఇవ్వాలంటూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆదేశించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటవీ ప్రాంతం నుంచి తాండవ జలాశయానికి వచ్చే నీట వనరులు తగ్గుతాయని జలవనరుల శాఖాధికారులు భావిస్తున్నారు. ఈ జలాశయం కింద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నాతవరం, కోటవురట్ల మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాల్లోని దాదాపు 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ప్రాజెక్టు సవివరణ నివేదిక (డిపిఆర్) తయారీకి టెండర్ పిలిచింది. ఈ ప్రాజెక్టును ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే అవకాశం లేనందున ప్రభుత్వ ఏజెన్సీగా నెడ్‌క్యాప్ వ్యవహరిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద రూ.5,404 కోట్లతో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై డిపిఆర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానుంది. దీనికి ముందే అటవీ శాఖ, జలవనరుల శాఖ నుంచి ఎన్‌ఒసిలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల అప్పర్ రిజర్వాయర్ నిర్మాణంలో తాండవకు వచ్చే 0.457 టిఎంసిల నీరు తగ్గనున్నట్లు ప్రాజెక్టు ఫీజిబిలిట్ నివేదికలో పేర్కొన్నారు. దీని ప్రకారం నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు తగ్గనుంది. వపర్ ప్రాజెక్టు పూర్తయ్యాక దీనికి నీటి అవసరం పెరిగితే తాండవ జలాశయానికి వచ్చే నీటి వనరులు తగ్గడం ద్వారా ఆయకట్టు సామర్థ్యం తగ్గిపోతే అవకాశముందని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నీటి ప్రవాహం, నిల్వ, నీటి వనరులపై అధ్యయనం చేసి ఉన్నతాధికారులతో చర్చించాలని వారు ఆలోచిస్తున్నారు. కానీ, ప్రభుత్వం అంతగడువు ఇవ్వకుండా ఎన్‌ఒసి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 742 ఎకరాలు అవసరం కానుంది. ఇందులో 687 ఎకరాల వరకు అటవీ శాఖ భూమి ఉంది. ఎన్‌ఒసి కోసం అటవీ శాఖపై కూడా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. 55 ఎకరాల ప్రయివేటు భూమి అవసరం కానుంది. ఇది గిరిజనుల సాగులో ఉంది. యాజమాన్య హక్కులు లేవనే సాకుతో వారి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.










