ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని వెంటనే ఆపాలని, భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని కోరుతూ ... పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.రాజకుమార్, కె.చిన్న బిల్డ్డింగ్ వర్కర్లు, జిల్లా కార్యదర్శి రొంగల ఈశ్వరరావు లు మాట్లాడుతూ ... ఇజ్రాయిల్ పాలస్తీనా పై చేసిన దాడిలో ఇప్పటివరకు ఏడువేలమంది ప్రజలు మరణించారని, వారిలో అత్యధికులు చిన్నపిల్లలు, మహిళలే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదని విమర్శించారు. యుద్ధాన్ని వీడి వెంటనే శాంతిని నెలకొల్పాలని 120 దేశాలు ఏకగ్రీవంగా ఐక్యరాజ్యసమితిలో ఆమోదించినవని ఈ ఆమోదాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. భారతదేశం గతం నుంచి కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుందని కానీ మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ కు వత్తాసుగా మాట్లాడుతుందని అన్నారు. 120 దేశాలు ఓటింగ్ సందర్భంగా భారతదేశం ఓటింగ్ లో గైర్హాజరయ్యిందని ఎద్దేవా చేశారు. యుద్ధం కొనసాగించాలని అమెరికా కూటమి దేశాలు కోరుకుంటున్నాయని, యుద్ధం కొనసాగితే అమెరికా ఆయుధ వ్యాపారం బాగా లాభాలతో సాగుతుందని అందువల్లనే అమెరికా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. పాలస్తీనా ఇజ్రాయిల్ ఘటన కొనసాగితే భవిష్యత్తులో భారతదేశంలో ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని, దీనివల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళలు అంగన్‌వాడి భవన నిర్మాణ కార్మికులు నెట్ల శ్రీను, డి.సత్యనారాయణ, విజయశాంతి, వెంకటలక్ష్మి, భవానీ, విశ్వనాధం, వీరబాబు, ప్రజావాణి, అచియమ్మ, తదితరులు పాల్గొన్నారు.










