Jul 08,2022 21:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుల జాతీయ సదస్సు ఆగస్టు 28న విజయవాడలో జరగనుందని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు తెలిపారు. ఎపి ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డుల సమస్యలను చర్చించి, పరిష్కారానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించడానికి జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెక్యూరిటీ గార్డులను సంఘటితం చేయాలని కోరారు. జాతీయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి నాగేశ్వరరావు, సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముజఫర్‌ అహ్మద్‌, నాయకులు రమేష్‌ బాబు, శేఖర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.