Jun 13,2022 16:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : కార్మికుల సమస్యల సాధన కోసమే సమ్మె నిర్వహించడం జరుగుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్ పేర్కొన్నారు. జూలై 1వ తేదీ నుంచి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించడం జరుగుతుందని.., ఈ మేరకు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మునిసిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వృత్తి, ఆరోగ్య భద్రత భత్యము చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ అలవెన్సులు యధావిధిగా కొనసాగించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని., ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, 60 సంవత్సరాల వయస్సు నిండిన కార్మికులను తొలగించినప్పుడు వారి స్థానంలో అదే కుటుంబంలో నుంచి ఒక వ్యక్తికి ఉపాధి కల్పించాలని అన్నారు. ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో పాటు వారికి ప్రతినెల ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మహిళా కార్మికులు నెలసరి సమయంలో వారికి ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తాము సమ్మెలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు సి.హెచ్ ఓబయ్య, కె.ప్రసాద్, డి.లక్ష్మీదేవి, ఎం. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.