- కృష్ణా డెల్టాకు పెరుగుతున్న నీటి ఎద్దడి
- జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ఏడాది సాగు నీటి ఎద్దడి తీవ్రం కానుంది. ప్రధానంగా 13.65 లక్షల ఎకరాలు సాగయ్యే కృష్ణా డెల్టాలో ఈ ఏడాది సేద్యం ఇబ్బందికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది జులై 19వ తేదీ వరకు ఆల్మట్టి జలాశయానికి నీరు రాకపోవడంతో ఈ ఏడాది సాగు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కృష్ణా డెల్టాకు ఎదురయ్యే ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు వినియోగించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. 2016 నుంచి మూడేళ్లపాటు ఏటా 80 టిఎంసిల వరకు గత టిడిపి ప్రభుత్వం కృష్ణా డెల్టాకు అందించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పట్టిసీమ నీటిని వినియోగించుకోలేదు. గత నాలుగేళ్లుగా కృష్ణా ఎగువ ప్రాంతం నుంచి సకాలంలో నీరు రావడం, ఏటా వరదలు కూడా సంభవించడం వల్ల ఈ కాలంలో నీటి సమస్య అంతగా రాలేదు. ఈ ఏడాది కృష్ణా ఎగువ ప్రాంతంలో ప్రధానంగా కర్ణాటకలో వర్షాలు లేకపోవడం, ఆల్మట్టి జలాశయానికి నీరు రాకపోవడం వల్ల రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతోంది. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన పులిచింతల జలాశయంలో గరిష్ట నిల్వ 45.77 టిఎంసిలు. బుధవారం 17.95 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది జులై 19న 37.27 టిఎంసిల నీరు ఉండేది. నాగార్జునసాగర్‌లో గరిష్ట నీటి నిల్వ 312 టిఎంసిలు. ప్రస్తుతం 144.94 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 171.48 టిఎంసిల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టిఎంసిలు. ప్రస్తుతం 33.62 టిఎంసిల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజుకు 147.99 టిఎంసిల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది శ్రీశైలంలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. కృష్ణా తూర్పు డెల్టాలో వరి సాగు కోసం గత కొన్ని రోజులుగా రోజూ ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 4.22 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం లక్ష ఎకరాల్లో వరి సాగవుతోంది. కృష్ణా పశ్చిమ డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. ఈ డెల్టాలో 4.36 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉన్నా ఇంకా వరి నాట్లు ప్రారంభం కాలేదు. వెద పద్ధతిలో 20 వేల ఎకరాల్లోనే సాగు ప్రారంభించారు. గతేడాది జులై రెండో వారం నాటికి ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల జలాశయాలకు వరద ప్రారంభమైందని, ఈ ఏడాది ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు లేక ఎగువ నుంచి జలాశయాలకు నీరు రావడంలేదని అధికారులు తెలిపారు.
నివేదిక వస్తే నిర్ణయంఅంబటి రాంబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి
కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి అధికారులు నివేదిక పంపితే ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తాం. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు వినియోగించాలని నీటిపారుదల శాఖాధికారుల ప్రతిపాదిస్తే ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. కృష్ణా డెల్టాకు తక్షణం నీరు అవసరమైతే వెంటనే పట్టిసీమ నుంచి విడుదలకు నిర్ణయం తీసుకుంటాం.










