Jun 26,2022 07:30
  • రెగ్యులేటర్‌ నిర్మాణంపై సిఎం హామీ నెరవేరేనా ?
  • భూముల రీసర్వే పూర్తయ్యేదెన్నడు ?
  • పర్యాటక అభివృద్ధి కాగితాలకే పరిమితం
  • ఉపాధిలేక వలసపోతున్న కొల్లేరు లంక గ్రామాల ప్రజలు


ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : 'కొల్లేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేస్తాను. కొల్లేరును రీసర్వే చేస్తామని గతంలో ఇచ్చిన హామీని కోవిడ్‌ వల్ల అమలు చేయలేకపోయాను. కొల్లేరు ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పుడు రీసర్వే చేయిస్తాం. ఇందుకు సంబంధించి అధికారుల ఆదేశాలు ఇచ్చాం. కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం'

                -గణపవరంలో గత నెల 16న జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇదీ
జూన్‌ 25 దాటినా రెగ్యులేటర్‌ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడితడిక, మోళ్లపర్రు గ్రామాల సమీపాన ఉప్పుటేరుపై ర.412 కోట్ల అంచనా వ్యయంతో మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను ప్రభుత్వం నాలుగు నెలల క్రితం మంజూరు చేసింది. శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా టెండర్ల ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. దీనికి సంబంధించి జ్యుడీషియల్‌ ప్రివ్యూ పరిధిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే తప్ప టెండర్లు పిలిచే పరిస్థితి లేదని చెప్తున్నారు.
 

                                                                తేలని కాంటూరు లెక్కలు

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 77 వేల ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. 120కిపైగా లంక గ్రామాల్లో ఎనిమిది లక్షలకుపైగా జనాభా నివాసం ఉంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున పంటల సాగు జరిగేది. 1969లో వచ్చిన తుపాన్‌ తర్వాత పరిస్థితి మారింది. ముంపు, కాలుష్యం పెరగడంతో వ్యవసాయం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం కొల్లేరులో వ్యవసాయం వీలుకాదని నిర్ధారించింది. 1976లో జలగం వెంకట్రావు ప్రభుత్వం 118 జిఒ ద్వారా చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. 1990 తర్వాత చేపలు, రొయ్యల సాగు జోరందుకుంది. పెద్ద స్థాయిలో ఆక్వా సాగు జరగడంతో అన్‌ సర్వేడు భూముల్లో కూడా చెరువుల తవ్వకాలు పెరిగి కొల్లేరు భారీగా ఆక్రమణకు గురైంది. 2006లో 'ఆపరేషన్‌ కొల్లేరు' పేరుతో కొల్లేరు ప్రాంతంలోని చేపల చెరువులన్నింటినీ అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసింది. కాంటూరు లెక్కలు తేల్చకుండా జిరాయితీ భూముల్లోని చెరువులను సైతం బాంబులు పెట్టి పేల్చేసింది. రైతులకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పినా, 15 ఏళ్లు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. కొల్లేరు రీసర్వే చేస్తే కాంటూరు లెక్కలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పది వేల ఎకరాలకుపైగా భూములు తమకు దక్కే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
 

                                                       కొల్లేరులోకి పరిశ్రమల కాలుష్యం

రాష్ట్రంలోని ఏకైక మంచినీటి సరస్సు కొల్లేరు. అరుదైన జాతుల పక్షులు, విదేశీ పక్షులు, పలు రకాల చేపలకు ఇది ఆవాసంగా ఉంది. ఆక్వా సాగుతో మంచినీటి సరస్సు మురుగు నీటి సరస్సుగా మారింది. సమీప లంక గ్రామాల ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. తాగు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. పరిశ్రమల కాలుష్య నీటితో కొల్లేరు పూర్తిగా కలుషితమైంది. మత్స్యజాతులు అంతరించిపోతున్నాయి. సాగుకు చెరువుల్లేక, వేటలేక లంక గ్రామాల ప్రజలు వలస పక్షుల్లా మారిపోయారు. వృద్ధులు తప్ప యువకులంతా కేరళ, తమిళనాడు వంటి పలు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. సముద్రంలోని ఆటుపోట్లకు ఉప్పు నీరు ఎగదన్ని కొల్లేరులో కలవడంతో పర్యావరణం దెబ్బతింటోందని, రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని నిపుణులు ఓ సర్వేలో పేర్కొన్నారు.
 

                                                               కాగితాల్లోనే అభివృద్ధి

ఇటీవల దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. కొల్లేరులో జలజీవన్‌ మిషన్‌ కింద తాగునీటి ట్యాంకుల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఐస్‌ ఫ్యాక్టరీలు నిర్మించాలని, పర్యాటక అభివృద్ధిలో భాగంగా మాధవాపురం వద్ద రెండు షికారు బోట్లు, చిల్డ్రన్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామన్లి ప్రకటించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయదలచారు. ఇవన్నీ అమలైతే కొల్లేరు ప్రజలకు ఉపాధి దొరకడంతో పాటు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. గత 15 ఏళ్లుగా ప్రకటిస్తున్న అభివృద్ధి ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. హామీలను అమలు చేయాలని, కొల్లేరు అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
 

                                                  మూడో కాంటూరుపై నెరవేరని మోడీ హామీ

2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పొత్తుతో రాష్ట్రంలో పోటీ చేశాయి. భీమవరంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో అప్పటి ఎన్‌డిఎ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కొల్లేరుకు పూర్వవైభవం తెస్తామని, మూడో కాంటూరుకు కుదించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ సభలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఈ మేరకు వాగ్దానం చేశారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించేందుకు టిడిపి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినా ఫలితం లేకపోయింది.