- దుబాయ్ ఓపెన్ తొలిరౌండ్‌లోనే ఓటమి
దుబాయ్ : భారత మహిళా టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి సానియా మీర్జా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించింది. కెరీర్ ఆఖరి టోర్నీ దుబారు డ్యూటీ ఫ్రి డబ్ల్యుటిఏ-1000 సిరీస్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ తొలిరౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సానియా-కీస్ జోడీ 4-6, 0-6తో కుడెర్మటోవా- సంసనోవా జోడీ చేతిలో వరుససెట్లలో ఓడింది. ఈ టోర్నీ తర్వాత మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టనని ఇప్పటికే ప్రకటించిన సానియా.. రెండు దశాబ్దాల సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ చివరి మ్యాచ్ ఓటమితో ముగించింది. అనంతరం సానియా మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగిడిన 36ఏళ్ల సానియా.. ఆరు డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్స్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో, మహేశ్ భూపతితో కలిసి 2009(ఆస్ట్రేలియన్ ఓపెన్), 2012 (ఫ్రెంచ్ ఓపెన్) మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను సాధించింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను బ్రూనో సొరెస్‌తో కలిసి చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) ఆరంభ సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మెంటార్‌గా ఎంపికైంది.










