- సెప్టెంబర్‌లో మొరాకోతో జరిగే మ్యాచ్ చివరిదంటూ ట్వీట్
బెంగళూరు: భారత టెన్నిస్ డబుల్స్ స్పెషలిస్ట్ ఆటగాడు రోహన్ బొప్పన్న టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు బుధవారం తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొరాకోతో జరిగే డేవిస్ కప్ తర్వాత టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు, అదే తన ఆఖరి ఫేర్‌వెల్ మ్యాచ్ అని వెల్లడించాడు. వీడ్కోలు మ్యాచ్‌ను బెంగళూరులో ఆడాలని నిర్ణయించుకున్నా.. డేవిస్ కప్‌కు ఉత్తరప్రదేశ్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో స్వంత మైదానంలో వీడ్కోలు పలికే అవకాశాన్ని బొప్పన్న కోల్పోయాడు. డేవిడ్ కప్ ప్రపంచకప్ గ్రూప్-2 పోటీలు భారత్-మొరాకో జట్ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. 43ఏళ్ల బొప్పన్న 2002నుంచి 32సార్లు డేవిస్ కప్ మ్యాచుల్లో ఆడాడు. లండన్‌లో సాధన చేస్తున్న బొప్పన్న ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని తెలిపారు. డేవిస్ కప్‌లో భారత్ తరఫున అత్యధికసార్లు ఆడిన రికార్డు లియాండర్ పేస్(58సార్లు) ఉండగా.. ఆ తర్వాత జయదీప్ ముఖర్సీ(43), రామనాథన్ కృష్ణన్(43), ప్రేమ్‌జిత్ లాల్(41), ఆనంద్ అమృత్‌రాజ్(39), మహేష్ భూపతి(35) రోహన్ బొప్పకంటే ముందున్నారు. మొరాకోతో డేవిస్ కప్ ఆడితే బొప్పన్న 32మ్యాచ్‌లతో విజరు అమృతరాజ్ రికార్డుకు చేరుకోనున్నాడు. డేవిస్ కప్ కెరీర్‌లో బొప్పన సింగిల్స్‌లో 12, డబుల్స్‌లో 10మ్యాచుల్లో విజయం సాధించాడు. ఈమేరకు కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్(కెఎస్‌ఎల్‌టిఏ) సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని ఆలిండియా టెన్నిస్ సమాఖ్య(ఎఐటిఏ) ధృవీకరించింది. గత ఆరు డేవిస్‌కప్‌లలో భారతజట్టు నాలుగుసార్లు గ్రూప్ దశను దాటలేకపోయింది. భారతజట్టు తనకంటే చిన్న ర్యాంక్ జట్లయిన పాకిస్తాన్, కజకిస్తాన్, డెన్మార్క్‌లపై మాత్రమే విజయాన్ని నమోదు చేసుకుంది.










