May 04,2023 21:40
  • ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

తస్కెంట్‌(ఉజ్బెకిస్తాన్‌): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో దీపక్‌ భోరియా, గోవింద్‌ సహాని శుభారంభం చేశారు. గురువారం జరిగిన 51కిలోల విభాగంలో 2019 ఆసియా క్రీడల రజిత పతక విజేత దీపక్‌ 5-0పాయింట్ల తేడాతో కొలంబియాకు చెందిన లూయిస్‌ డెల్గాండోపై ఘన విజయం సాధించాడు. ఇక 48కిలోల విభాగంలో గోవింద్‌ సహాని కూడా 5-0పాయింట్ల తేడాతో తజకిస్తాన్‌కు చెందిన మెహ్రూన్‌ షఫీవ్‌పై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. ఇక ఆరుసార్లు ఆసియా క్రీడల పతక విజేత శివ థాపా, నరేంద్ర బెర్వాల్‌ గురువారం జరిగే తొలిరౌండ్‌ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.