- ఫైనల్లో ఇరాన్‌పై గెలుపు
11వ ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్ బూసాన్(దక్షిణ కొరియా): 11వ ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్-2023 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 42-32పాయింట్ల తేడాతో ఇరాన్‌ను చిత్తుచేసింది. కెప్టెన్ పవన్ షెహ్రావత్ సూపర్-10 పాయింట్లు సాధించి భారతజట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో భారతజట్టుకు స్వర్ణ పతకం ఖాయమైంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో జరుగుతున్న టోర్నీలో లీగ్ దశలోనూ భారతజట్టు ఇరాన్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. రైడింగ్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. దీంతో మ్యాచ్ ముగిసేవరకు భారతజట్టు ఆరునుంచి ఏడు పాయింట్లు ఆధిక్యతలోనూ నిలుస్తూ వచ్చింది. ఇక ఇరాన్ జట్టులో సయీద్, మొయిన్ అమీర్, మహ్మద్ రాణించారు. ఇరాన్ రైడర్ల దాడులను ప్రతిసారి భారత ఆటగాళ్లు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. మ్యాచ్ మొత్తమ్మీద భారత్ మూడుసార్లు ఇరాన్‌జట్టును ఆలౌట్ చేసింది.










