లాసన్నె: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ జావెలిన్ త్రో విభాగంలో భారత స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తాచాటాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ ఐదో రౌండ్ త్రో ప్రయత్నంలో 87.66మీటర్లు విసిరి ప్రథమస్థానంలో నిలిచాడు. 25ఏళ్ల నీరజ్.. గాయం కారణంగా ఒక నెల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గంటున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ అయిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 83.52మీ. ఆ తర్వాత ప్రయత్నంలో 85.04మీ. త్రో చేశాడు. నాల్గో ప్రయత్నంలో మళ్లీ ఫౌల్ అయిన నీరజ్.. ఐదో ప్రయత్నంలో త్రోయర్‌ను 87.66మీ. విసిరాడు. ఆరో, చివరి ప్రయత్నంలో 84.15మీ. మాత్రమే విసరగలిగాడు. దీంతో అత్యుత్తమ త్రో అయిన 87.66మీ. తో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్(87.03మీ.), చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకోబ్ వెడ్లెజ్(86.13మీ.) రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజిత, కాంస్య పతకాలను గెలిచాడు. దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్‌లో నీరజ్ 88.67మీ. విసిరి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక నీరజ్ పర్సనల్ బెస్ట్ 89.94మీటర్లు. ఇక భారత్‌కే చెందిన 24ఏళ్ల మురళీ శ్రీశంకర్ నీరజ్ కంటే 7.88మీ. వెనుకబడి 5వ స్థానానికే పరిమితమయ్యాడు.










