- ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్
అస్తానా(కజకిస్తాన్): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పురుషుల 57కిలోల విభాగంలో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో అమన్ 9-4పాయింట్ల తేడాతో స్మాన్బెకోవ్(కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించాడు. సీనియర్ విభాగంలో అమన్‌కు స్వర్ణ పతకం లభించడం ఇదే తొలిసారి. సెమీఫైనల్లో అమన్ 7-1పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన రికూటో అరారుపై, క్వార్టర్స్‌లో చైనాకు చెందిన వాన్హోపై 7-4పాయింట్ల తేడాతో గెలిచి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సెహ్రావత్ గత ఏడాది జరిగిన అండర-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ కూడానూ. ఇక దీపక్ కుకున్నా(79కిలోలు), దీపక్ నెహ్రా(97కిలోలు) కాంస్య పతకాలు సాధించగా.. అనుజ్ కుమార్(65కిలోలు), ములాయమ్ యాదవ్(70కిలోలు) సెమీస్‌లో ఓడి పతక పోటీకి అర్హత సాధించలేకపోయారు. దీంతో ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు మొత్తం 12పతకాలు దక్కాయి. ఇక గ్రేకో రోమన్ మహిళల రెజ్లింగ్‌లో ఏడు కేటగిరీల్లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి.










