- కాటన్ బ్యారేజీ వద్ద 14.50 అడుగులు,
- భద్రాచలం వద్ద 46.5 అడుగుల నీటిమట్టం
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లంకలను చుట్టిముట్టింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 14.50 అడుగులు నమోదైంది. కాటన్ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పైకి లేపి 13:57,790 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంట కాలువలకు 4000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వరద నీటి ప్రవాహం పెరగడంతో లంకల ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వాయుగుండ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గోదావరి తీర ప్రాంతవాసులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు. పి.గన్నవరంలో కనకాయలంక నీట మునిగింది. అక్కడ ప్రజలు పెదవులపై ప్రయాణాలు సాగిస్తున్నారు. రాజమండ్రిలో బ్రిడ్జి లంక ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించారు.










