ప్రజాశక్తి- యంత్రాంగం : గోదావరి నదీ ప్రవాహం ఆదివారం నాటికి సాధారణ స్థితికి చేరుకుంది. వరద ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీల వద్ద ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకు న్నారు. ప్రస్తుతం ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద 11 అడుగుల నీటి మట్టం నమోదైంది. బ్యారేజీ నుంచి 8.77 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 31.20 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు అప్పర్ స్పిల్ వే వద్ద 32.26 మీటర్లు, దిగువ స్పిల్‌వే వద్ద 23.78 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అక్కడి నుంచి 15 గేట్ల ద్వారా ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం, ఐ.పోలవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో వరద దాదాపుగా తగ్గుముఖం పట్టింది. రెండు వారాలుగా ముంపులో ఉన్న సుమారు 35 గ్రామాలు వరద నుంచి బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పరివాహక ప్రాంతాలైన ఎనిమిది మండలాల్లోని తొమ్మిది ముంపు గ్రామాల్లో వరద పూర్తిగా తగ్గింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోట, రేపాకగొమ్ము రహదారులపై వరద నీరు తగ్గినా బురద పేరుకుపోవడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలో వరద తగ్గుముఖం పట్టడంతో లంకగ్రామాలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి. 12 రోజుల తరువాత పడవల అవసరం లేకుండా లంకవాసులు ఇళ్ల నుంచి బయటకొచ్చారు.
తేరుకుంటున్న విలీన గ్రామాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, విఆర్.పురం, కూనవరం ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి తేరుకుంటున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. చింతూరు మండల సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు సాగాయి. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆర్‌టిసి బస్సు సర్వీసులు కొనసాగాయి.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,11,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి జూరాల డ్యాం గేట్ల నుంచి 1,62,800 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,293 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 17,244 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తంగా 2,12,337 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత మట్టం 884.60 అడుగులకు చేరింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా ప్రస్తుతం 213.4011 టిఎంసిలుగా నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 31,170 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్రకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
30,769 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1633 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టిఎంసిలుగా కాగా అది గరిష్ట స్థాయికి చేరింది. ఎపి బార్డర్ హెచ్‌ఎల్‌సికి 1789 క్యూసెక్కులు, కర్ణాటక, ఎపి బార్డర్ ఎల్‌ఎల్‌సికి 895 క్యూసెక్కులు టిబిబి బార్డర్ ఎల్‌ఎల్‌సికి 501 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజికి స్థిరంగా వరద
నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాలకు వరద ప్రవాహాం తగ్గుముఖం పటింది. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి 1.76 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా జలాశయం నుంచి 1.93 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 1.34 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.23 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1.38 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 13 వేల క్యూసెక్కులను తూర్పు, పశ్చిమ డెల్టాల కాల్వలకు, 1.25 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.










