Jun 29,2023 22:23

మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌
ముంబయి : భారత మహిళల క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ ఆడనుంది. జులై తొలి వారంలో బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనున్న భారత వైట్‌బాల్‌ జట్టు.. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో పోటీపడనుంది. జులై 9న తొలి టీ20తో పొట్టి సిరీస్‌ ఆరంభం కానుండగా.. జులై 16, 19, 22న వన్డేలు జరుగనున్నాయి. గత తొమ్మిదేండ్లలో బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లటం భారత్‌కు ఇది తొలిసారి. గత పర్యటనలో టీ20 సిరీస్‌ను 3-0తో స్వీప్‌ చేసిన టీమ్‌ ఇండియా అమ్మాయిలు.. ఈ సారి వన్డే సిరీస్‌లోనూ ఆడనున్నారు.
చీఫ్‌ కోచ్‌గా మజుందార్‌! : రమేశ్‌ పోవార్‌ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు బదిలీ అనంతరం.. భారత మహిళల జట్టుకు చీఫ్‌ కోచ్‌ లేడు. హృషికేశ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ (ఫిబ్రవరి) సెమీఫైనల్లో ఓడిన భారత్‌.. ఆ తర్వాత మరో సిరీస్‌ ఆడలేదు. తాజాగా క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) నిర్వహించిన ఇంటర్వ్యూకు మాజీ క్రికెటర్లు అమోల్‌ ముజుందార్‌, తుషార్‌ అరోతె, జాన్‌ లెవిస్‌లు హాజరయ్యారు. ముంబయి మాజీ కోచ్‌ అమోల్‌ ముజుందార్‌ చీఫ్‌ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బంగ్లా పర్యటనకు చీఫ్‌ కోచ్‌తోనే భారత జట్టు వెళ్లనుంది.