May 18,2023 22:15

ఆడిలైడ్‌: ఆస్ట్రేలియా అమ్మాయిలతో జరుగుతున్న మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. ఆడిలైడ్‌లోని మటే స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 2-4గోల్స్‌ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరిగే ఆసియా క్రీడల సన్నద్ధతలో భాగంగా భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 8వ ర్యాంక్‌లో ఉండగా.. రెండో క్వార్టర్‌లో భారత్‌ వరుసగా రెండు గోల్స్‌ సమర్పించుకొంది. గోల్‌ కీపర్‌ సవిత పూనియా సారథ్యంలోని భారత మహిళల జట్టు మూడో క్వార్టర్‌ ముగిసే సరికి 1-4తో వెనుకబడింది. నాల్గో క్వార్టర్‌లో భారత్‌ ఒక గోల్‌ చేయగా.. ఆస్ట్రేలియాకు మరో గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత అయిన భారతజట్టు రెండు గోల్స్‌ అంతరంతో ఓటమిపాలైంది. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ ముగిసిన అనంతరం భారతజట్టు ఆస్ట్రేలియా-ఏతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ఆడనుంది.