- రంజీట్రోఫీలో ఆటగాళ్ల ప్రదర్శనను చూడాలి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సెలెక్టర్లపై వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వన్డే, టి20లకు సెలెక్షన్‌కు ఐపిఎల్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు రంజీ ట్రోఫీని టెస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. ఎస్‌ఎస్ దాస్ సారథ్యంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ.. విండీస్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లకు 16 మందితో కూడిన టెస్ట్, 17మందితో వన్డే జట్లను ప్రకటించింది. వన్డేల్లో పెద్దగా మార్పులు చేయకున్నా.. ఛటేశ్వర పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్‌పై వేటు వేసి రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ముఖేశ్ కుమార్‌లకు అవకాశం కల్పించింది. ఈ విషయమై సెలెక్షన్ కమిటీపై గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత రెండు సీజన్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను తీసుకోకపోవడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. అలాగే పుజారాపై వేటు వేయడం కూడా సరికాదని, అతనికి భారీ సంఖ్యలో ఫాలోవర్లు లేకపోవడంతోనే జట్టు నుంచి తప్పించారని విమర్శించాడు. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని జట్టులోకి తీసుకుంటే.. రంజీల్లో ఆడుతున్న వారికి గుర్తింపు దక్కిందని అన్నాడు. రెడ్ బాల్‌కు ఐపిఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ నిర్వహించడం ఎందుకు? దాన్ని ఆపేయండి అని గవాస్కర్ కోరాడు.










