పారిస్: ఫ్రాన్స్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్ అరుదైన ఘనత సాధించాడు. టెన్నిస్ చరిత్రలో 600 విజయాలతో దిగ్గజాల సరసన చేరాడు. మొత్తంగా నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు రఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే మాత్రమే ఈ ఫీట్ సాధించారు. బాస్ ఓపెన్‌లో 55వ సీడ్ రిచర్డ్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఐదో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్(గ్రీస్)ను ఓడించాడు. మూడు సెట్లలో 7-6(8), 2-6, 7-5తో చిత్తు చేశాడు. ఇది రిచర్డ్ గాస్కెట్‌కు 600వ విజయం. రికార్డు విక్టరీతో లెజెండ్స్ సరసన నిలవడం పట్ల గాస్కెట్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది నాకు నిజంగా గొప్ప విజయం. ఈ ఘతన సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇరవై ఏళ్లుగా ఆడుతున్నా. ఈరోజు 600 మ్యాచుల్లో విజయం నమోదు చేయడం చాలా అద్భుతంగా అనిపించింది' అని గాస్కెట్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. గాస్కెట్ తనకంటే మెరుగైన ర్యాంకు ఉన్న ప్లేయర్స్‌కు షాక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు చూస్తే.. ఐదో ర్యాంకులోపు ఆటగాళ్లను అతను 11 సార్లు ఓడించాడు. టాప్ 10లోని ఆటగాళ్లపై అతడు గెలుపొందడం ఇది 32వ సారి.










