Feb 12,2023 13:26

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌, మనం మన పరిశుభ్రత, వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంతోపాటు పారిశుధ్యంపై అవగాహన వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మెరుగుపడటం లేదు. సమస్య నానాటికీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఆహ్లాదకంగా ఉండాల్సిన రహదారులు, కాలువ గట్లు డంపింగ్యార్డులుగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో తాము వ్యాధుల బారినపడుతున్నామని స్థానికులు, ప్రయాణీకులు వాపోతున్నారు. ఇవి కుక్కలకు, పందులకు, దోమలు, క్రిమికీటకాలకు అవాసాలుగా మారుతుండటంతో రాత్రి సమయాల్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్థానిక బైపాస్‌ ఇందిరాగాంధీ రోడ్డులతోపాటు మండలంలోని వెలగతోడు, తాపేశ్వరం, అర్తమూరు, తదితర గ్రామాల్లో రోడ్ల, కాలువల వెంబడి ఉన్న చెత్తాచెదారాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. స్థానిక పెద్ద కాలువ వంతెన సమీపంలోను రహదారి వెంబడి చెత్తను వేయడంతోపాటు ఆ చెత్తకు నిప్పు పెడుతుండటంతో ఆ రోడ్లపై ప్రయాణించేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారుతున్నా సమస్యల పరిష్కారానికి నోచుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. మూతపడ్డ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను తెరిచి, చెత్తను అక్కడికి తరలించాలని కోరుతున్నారు. పచ్చదనం, పరిశు భ్రతను కాపాడే విధంగా అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.