Sep 27,2023 13:04

అమరావతి : చివరి రోజు ఎపి సర్కార్‌ శాసన సభ సమావేశాల్లో జిపిఎస్‌ బిల్లును ప్రవేశపెట్టింది. నేరుగా అసెంబ్లీ ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది.. జిపిఎస్‌ ను సిపిఎస్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న సంగతి విదితమే. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఎపి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. జిపిఎస్‌ బిల్లును ప్రవేశపెట్టి.. సభలో మాట్లాడారు.

బిల్లులోని కీలక అంశాలు...
రిటైర్‌ అయ్యే నాటికి ఉన్న బేసిక్‌ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఇవ్వనున్నారు.. పెన్షన్‌దారు మరణిస్తే భార్య లేదా భర్తకు పింఛన్‌లో 60 శాతం గ్యారెంటీ పొందుపర్చారు. ద్రవ్యోల్బణం ప్రకారం సర్దుబాటు చేసిన డీఏగా లాస్ట్‌ డ్రా బేసిక్‌ పేపై జీవన వ్యయ సర్దుబాటు చేస్తారు. ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉన్నా నెలకు రూ.10 వేలు కనీస పింఛను భరోసా ఇవ్వబోతున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీం వర్తింప జేస్తారు.

వాలంటీర్ల నిబంధనలు..
వాలంటీర్‌ రిటైర్మెంట్‌ అయితే కనీసం 20 ఏళ్లు సర్వీస్‌ చేసి ఉండాలి. సర్వీస్‌ మధ్యలో రాజీనామా చేస్తే పథకం వర్తించదు. క్రమశిక్షణా చర్యలు, బర్తరఫ్‌ లాంటి సందర్భాల్లో పథకం వర్తించదు.

జిపిఎస్‌తో ప్రభుత్వంపై అదనపు భారం : మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌
జిపిఎస్‌తో ప్రభుత్వంపై రూ.2500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఆశా వర్కర్లకు గతంలో రూ.3వేలు మాత్రమే ఇచ్చేవారనీ... ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ.10వేలకు పెంచామన్నారు. 108 డ్రైవర్లకు జీతాలు పెంచామని.. హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చామని మంత్రి అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రకటించారు. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచామని గుర్తుచేశారు. 2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం చేకూరిందని ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వివరించారు.