Oct 02,2023 20:32

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో / న్యూఢిల్లీ : దొంగ కేసులు, అక్రమ కేసుల నుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడుతాయని, కోర్టు నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ, సోమవారం ఢిల్లీలో లోకేష్‌ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 3న సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ విచారణకు వస్తుందన్నారు. ఆధారాలు లేని స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబును జైలుకు పంపడమే కాకుండా మరో మూడు కేసులు సిద్ధం చేశారన్నారు. మంత్రి రోజా తనతోపాటు తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణిని జైలుకు పంపుతామని అంటున్నారని, ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని అన్నారు. తమపై పెట్టిన తప్పుడు కేసులను ఆధారాలతో సహా అన్నీ ప్రజల ముందు ఉంచుతామని లోకేష్‌ వెల్లడించారు. లోకేష్‌ దీక్షకు ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు) జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, ఎపి మేధావుల సంఘం నాయకులు చలసాని శ్రీనివాసులు, పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకులు డివై దాస్‌తో పాటు ఎంపిలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కె రామ్మోహన్‌నాయుడు, వైసిపి ఎంపి రఘరామ కృష్ణరాజు, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహనరావు, మాజీ మంత్రి కొండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో...

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, శాసన మండలి మాజీ ఛైర్మన్‌ ఎంఎ షరీఫ్‌ పాల్గొన్నారు.