కొంతమంది కాలగమనంలో కనుమరుగవుతారు. మరికొందరు చరిత్రలో లిఖించబడతారు. భావితరాలకు మార్గదర్శకులవుతారు. అలాంటి మార్గదర్శకులు, వీరయోధులు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో అనేకమంది మనకు తారసపడతారు. స్వేచ్ఛా భారతావని కోసం అశువులు బాసిన ఎందరో త్యాగధనుల చరిత్ర నేటితరాలకు ఎంతో ఉద్వేగంగా ... మరెంతో ఉద్విగంగా కళ్లకు కడుతుంది.

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరయోధులు విప్లవ భావాలను ప్రచారం చేసి... ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు. సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన అనేక పోరాట సంస్థల సమాహారమే భారత స్వాతంత్య్రోద్యమం. ఈ ఉద్యమంలో మహిళలు సైతం అనేక చారిత్రక ఘట్టాల్లో పురుషులతో సమానంగా ఎన్నో సాహసాలను ప్రదర్శించారు. స్వాత్రంత్ర పోరాటం అనగానే... గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ వంటి వారు గుర్తుకొస్తారు. కానీ భరతమాత దాస్య విముక్తి కోసం నాటి యువతీ యువకులు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. మహిళలు బయటకు రావడానికే సందేహించే కాలంలో పోరాటాలను నడిపారు. ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగాలు, వీర మరణాలతో ఆసేతు హిమాచలం నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా భారతం ఆవిర్భవించింది.
తమ అసమాన పోరాటంతో జనం మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అనేకమంది వీరులు దేశం కోసం ఉరికంబం ఎక్కారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేశారు. బ్రిటిష్ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ సెంట్రల్ పార్లమెంట్ హాల్లో బాంబులు విసిరి కరపత్రాలు పంచి నిరసన వ్యక్తం చేసిన విప్లవ వీరులు. వీరిని బ్రిటీష్ ప్రభుత్వం అంతర్జాతీయ జైలు నిబంధనలకు విరుద్ధంగా 1931 మార్చి 23న ఉరి తీసింది. వారి త్యాగం అప్పటి యువతకే కాదు... ఇప్పటి తరానికీ ఆదర్శనీయమే. వీరి మరణానికి 24 రోజుల ముందే వీర మరణం పొందినవాడు చంద్రశేఖర్ ఆజాద్. బాల్యదశ నుంచి బ్రిటిష్ వారిపై విప్లవ సమరశంఖం పూరించాడు చంద్రశేఖర్ ఆజాద్. 'తానెప్పుడూ పోలీసులకు చిక్కనని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే తప్ప సజీవంగా మాత్రం పోలీసుల చేతికి చిక్కనని, ఆజాద్‌గానే జీవిస్తానని, మరణాన్ని కూడా ఆజాద్ గానే స్వీకరిస్తానని' ఒక బహిరంగ సభలో ప్రకటించిన సాహసి ఆయన. అంతేకాదు... భారతీయ స్వాతంత్ర సమర వీరుల్లో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు ఖుదీరాం బోస్. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా 1908 ఆగష్టు 11న 18 ఏళ్ల వయసులో అతన్ని ఉరితీశారు. వీరి పోరాటం, ప్రాణత్యాగం నాటి తరానికే కాదు నేటి తరానికీ ఆదర్శమే. నీతి, నిజాయితీ, స్త్రీల పట్ల గౌరవం, ఆశయ సాధనకు కట్టుబడి ఉండడం వీరి జీవితాల నుంచి మనం నేర్చుకోవల్సిన ఆదర్శాలు.
ఎందరో మహిళా యోధులు
భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీర యోధుల్లో మహిళలు కూడా ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర చరిత్రలో వీరి పాత్ర, పోరాట పటిమ అమూల్యమైనది. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచే వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి. ఇప్పటికీ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారిని ఝాన్సీ లక్ష్మిబాయితో పోల్చడం పరిపాటి. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన స్వాత్రంత్ర సమర యోధురాలు సరోజిని నాయుడు, చిన్నతనంలోనే జాతీయోద్యమంలో పాల్గొన్న దుర్గాభాయి దేశ్‌ముఖ్ .. మహిళాశక్తిని చాటి చెప్పారు. భారత స్వాత్రంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదం తొక్కిన వీర వనిత కెప్టెన్ లక్ష్మీ సెహగల్. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న లక్ష్మీ సెహగల్ గురించి నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు. బాల్యంలోనే భర్తను కోల్పోయిన దువ్వూరి సుబ్బమ్మ... స్వతంత్ర సమరంలో జైలుకు వెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ. అక్షరాలనే ఆయుధాలుగా కవితలతో స్వాతంత్య్ర సంగ్రామం లో పోరాట పటిమను రాజేసిన అక్షరశిల్పి కుంతల కుమారి సబత్, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించిన అన్నపూర్ణ మహారాణా ... ఇలా ఎంతోమంది వీరవనితలు స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. స్త్రీలపై అన్ని విధాల ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే ఎన్నో త్యాగాలు చేసిన వీరయోధులు ఎందరో వున్నారు.
దీనికి భిన్నమైన చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలది. స్వాతంత్య్రోద్యమం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ పూర్తిస్థాయిలో తనను తాను మినహాయించుకుంది. దేశంలోని అనేకమంది స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడుతుంటే... మతోన్మాద కలహాలు రేపడంలో ఆర్‌ఎస్‌ఎస్ తలమునకలై ఉంది. బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయిన ఆర్‌ఎస్‌ఎస్... నేడు జాతీయోద్యమ పాఠాలు చెప్పడం, త్యాగాలు చేసిన వీర యోధులను కించపరచడమే !










