ప్రజాశక్తి- భీమడోలు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ సభ్యులు వట్టి వెంకట రంగ పార్థసారథి (92) ఆదివారం రాత్రి కన్నుమూశారు. వయోభారంతో విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ ఎంఎంపురం ప్రాంతానికి చెందిన ఆయన 1931లో జన్మించారు. కాంగ్రెస్ నేతగా పలు పార్టీ పదవులు, పలు ప్రభుత్వ విభాగాల సభ్యునిగా కొనసాగారు. 1982-86 మధ్య శాసనమండలి సభ్యులుగా పని చేశారు. 1968-74, 1992-95 నడుమ డిసిసిబి చైర్మన్‌గా సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు, మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఇటీవల మృతి చెందారు. రెండేళ్ల క్రితం భార్య వాసుకి మరణించారు. పార్థసారథి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం ఎంఎంపురంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు.










