Jul 29,2022 10:27
  • గుడారాల్లోనే ఆవాసం
  • ఆకలి, దప్పికలకు అవస్థలు
  • ప్రాణాలు అరచేత పెట్టుకుని గిరిజనుల జీవనం
  • గోదావరి వరద బీభత్సంతో అల్లూరి జిల్లా విఆర్‌.పురం మండలంలో దయనీయ పరిస్థితులు

ప్రజాశక్తి - రాజమహేంద్ర ప్రతినిధి : ఒక వైపు ఎడతెరిపిలేని వాన, మరో వైపు ప్రళయంలా గోదావరి వరద.. గ్రామాల్లోకి పోటెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని పిల్లా పాపలతో పరుగు పెట్టారు అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్‌.పురం మండలంలోని జీడిగుప్ప గ్రామస్తులు. ఈ గ్రామంతో పాటు చుట్టు పక్కల 14 గ్రామాలు ఈ నెల రెండో వారంలో గోదావరి వరద కారణంగా పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుతం వరద ముంపు తగ్గినప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లోని గిరిజనులు కొండలపై ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గూడారాలలోనే తలదాచుకుంటున్నారు. ఇక్కడి గిరిజనుల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు 'ప్రజాశక్తి' బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది.
గోదావరి వరద అల్లూరి జిల్లాలోని విలీన మండలాలు, ఏజెన్సీలో నివసించే గిరిజనులకు కడగండ్లను మిగిల్చింది. జీడిగుప్ప గ్రామంలో 150 కుటుంబాల్లో 15 కుటుంబాలు కిలోమీటరు దూరంలోని పూచిమెట్ట కొండపైకి చేరాయి. అక్కడ గత ఏడాది ఏర్పాటు చేసిన సోలార్‌ లైటు కిందే ఇప్పటికీ జీవనం సాగిస్తున్నాయి. తూర్పు వైపున రేబాల గుట్టపై 70 కుటుంబాలు తలదాచుకున్నాయి. ఈ రెండు గుట్టలపైన తాగేందుకు నీరు లేదు. వరద నీటినే కాచి వడబోసి దప్పిక తీర్చుకుంటున్నారు. రేబాల గుట్టలో 1986లో నిర్మించిన తుపాను షెల్టరు భవనం కేవలం పది కుటుంబాల వారికి మాత్రమే ఉపశమనం కలిగించింది. జీడిగుప్ప కాలనీలో 30 కుటుంబాలు, రాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో 20 కుటుంబాలు, కొండదారిలో 35 కుటుంబాలు గుడారాలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. ములకపల్లిలోని 130 కుటుంబాలు ఉండగా దాదాపు 100 కుటుంబాలకు చెందిన ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఇప్పట్లో కొండ దిగే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొటారుగొమ్ము గ్రామంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. బియ్యం, కూరగాయలు, రూ.2 వేల నగదు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడిగుప్ప, శ్రీరామగిరి పంచాయతీల్లో 35 అడుగులు, ములకపల్లిలో 40 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది.
 

                                                                పాలకుల నిర్లక్ష్యంతో గిరిజనులకు పాట్లు

జీడిగుప్ప, శ్రీరామగిరి పంచాయతీల్లో గోదావరి ఒడ్డున ఉన్న 15 గ్రామాలకు సంబంధించి 1366 కుటుంబాలు ఉన్నాయి. జీడిగుప్ప, కల్తునూరు, రాయగూడెం, విసునూరు, ములకపల్లిలతో పాటు ముత్యాలమ్మగండి, భీమారం, కొటారుగొమ్ము, వెంకటనరసాపురం, ఇప్పూరు గ్రామాల్లో సుమారు 901 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ పూర్తిగా జల సమాధి కావడంతో కొండలపైన నివాసం ఉంటున్నారు. పోచారం, గొందూరు, కొల్లూరుల్లో సుమారు 465 కుటుంబాలకు బాహ్య ప్రపంచంతో ఇప్పటికీ సంబంధాలు లేవు. బోట్లుపైనే వచ్చి కుటుంబ అవసరాల నిమిత్తం సరుకులు తీసుకుని తిరిగి వెళ్తున్నారు. ప్రభుత్వం కేవలం రెండు బోట్లు కేటాయించి, వారం రోజులు మాత్రమే ప్రయాణ సౌకర్యం కల్పించింది. అదీ వ్యాధిగ్రస్తులకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో రెండు ప్రైవేటు బోటులను ఆశ్రయించి గిరిజనులు అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ గ్రామాలన్నీ 41.5 కాంటూరులో ఉన్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించకపోవడంతో ప్రజలు ఇక్కడే నివాసం ఉంటున్నారు.

 

333