ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే రోజుకు పదివేల అడుగులు నడవాలనేది చాలా కాలంగా చెబుతున్నదే. అయితే, కొత్త అధ్యయనం ప్రకారం ఐదు వేల అడుగుల కంటే తక్కువే నడిచినా గొప్ప ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా 2,26,000 మందిపై చేసిన ఒక విశ్లేషణలో రోజుకు 4,000 అడుగులు నడిస్తే ఏ కారణంగానైనా సంభవించే అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని తేలింది. గుండెకు, రక్తనాళాలకు మేలు కలగడం కోసం రోజుకు 2,300 అడుగులు నడిస్తే సరిపోతుంది. ఎంత ఎక్కువగా నడిస్తే, అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు. నాలుగు వేలు దాటిన తర్వాత 20 వేల అడుగుల వరకూ జోడించే ప్రతీ వెయ్యి అడుగులు అకాల మరణం ముప్పును 15 శాతం తగ్గించాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 10 వేల అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్న మాట.
నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా అందరికీ, అన్ని వయస్సుల వారికీ ఇవి వర్తిస్తాయి. పోలాండ్లోని మెడికల్ యూనివర్సిటీ, అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బృందాలు నడక వల్ల ప్రయోజనాలపై ఇటీవల పరిశోధన చేశాయి. 60 ఏళ్లలోపు వారిలో దీనివల్ల గొప్ప ఫలితాలు కనిపించాయి. వ్యాధి చికిత్సల కోసం అధునాతన ఔషధాల సంఖ్యా పెరుగుతున్నాయి. అయినప్పటికీ వ్యాధుల నుంచి రక్షణకు ఇదొక్కటే సమాధానం కాదనీ నిపుణులు అంటున్నారు.
డైట్, వ్యాయామం సహా జీవనశైలిలో మార్పులపై దృష్టి పెట్టాలి. వీరు చేసిన విశ్లేషణలో కూడా ఇదే మా ప్రధాన అంశం. 'గుండె సంబంధిత ముప్పులను తగ్గించుకోవడానికి, జీవిత కాలాన్ని పెంచుకోవడానికి మెరుగైన జీవనశైలిని అనుసరించాలి' అని ఆ బృందంలోని నిపుణులు వెల్లడించారు. ఎంత ఎక్కువ నడిస్తే, అంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్లే ప్రతీ ఏడాది 32 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇది నాల్గవ అత్యంత సాధారణ కారణం. ఎక్కువసేపు కూర్చోవడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మేరకు గ్లోబల్ ఫిట్నెస్ కంపెనీ 'బరీస్' ఇన్స్ట్రక్టర్, వ్యక్తిగత శిక్షకులు హెచ్చరిస్తున్నారు.
'ఇది జీవక్రియ వేగాన్ని తగ్గించవచ్చు. కండరాల వృద్ధి, సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కండరాల నొప్పులు కలుగుతాయి' అని వారంటున్నారు. 'ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు వస్తాయి. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్యలను ఎక్కువగా చూస్తుంటాం. వారి వెన్నెముక నిరంతరం కుంచించుకుపోయిన స్థితిలో (కంప్రెస్డ్), ఒత్తిడిలో ఉంటుంది. ఇది తర్వాత చాలా సమస్యలకు దారి తీస్తుంది' అని నిపుణులు వివరించారు.
వ్యాయామంతో నేరుగా సంబంధం లేని, అంటే చూడటానికి వ్యాయామం చేస్తున్నట్లుగా కనిపించని పనుల ప్రాధాన్యాన్ని వాళ్లు నొక్కి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను 'థర్మోజెనెసిస్' అని పిలుస్తారు. థర్మోజెనెసిస్ అంటే మన శక్తిని, కేలరీను ఖర్చు చేసేందుకు చేసే ప్రతీ పని. 'నిల్చోవడం, సరుకులను మోసుకురావడం, నేలను శుభ్రం చేయడం, వూడవటం, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అటూ ఇటూ తిరగడం వంటి చిన్న చిన్న పనులన్నీ మన కేలరీలను ఖర్చు చేయడంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి' అని బృంద నిపుణులు వివరించారు. రోజూ నడవడాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యపరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని వారు తెలిపారు. 'నడక వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఎముకలకు రక్షణగా ఉండే కండరాలు శక్తిమంతమవుతాయి. ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది' అని చెప్పారు.
నడక వల్ల ఇతర ప్రయోజనాలు ఏంటంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు పరధ్యాస, స్క్రీన్ల వినియోగం నుంచి దూరంగా ఉండొచ్చు. నడక అత్యధికులకు అనుకూలమైన వ్యాయామని వారు చెప్తున్న బంగారు మాట.
ఇంకెందుకు ఆలస్యం..
ఆరోగ్యం కోసం..
నడక ఫాలో.. ఫాలో.. అయిపోండి..!
టిప్స్..
- సమీపంలోని మార్కెట్‌కో, బస్టాండ్, రైల్వేస్టేషన్‌కి గానీ వాహనాన్ని వాడకుండా, నడవండి.
- డెస్క్‌లో పని చేస్తుంటే లేచి కదలడానికి గంటకోసారి రిమైండర్లు పెట్టుకోండి.
- గర్భిణులకు నడక చాలా ఉత్తమమైన వ్యాయామం.
- సంగీతం లేదా ఒక పాడ్‌కాస్ట్ వింటూ రోజూ 30 నిమిషాలు నడవండి.
- స్నేహితులతో పార్క్‌లో నడవండి. మీకు పెంపుడు కుక్క ఉంటే దానితో వాకింగ్‌కు వెళ్లండి.
- మెల్లిగా ప్రారంభించండి.
- బస్టాప్ నుంచి ఆఫీసుకు రోజువారీ 10 నిమిషాల నడక, నెమ్మదిగా పార్క్‌లో 20 నిమిషాల నడకగా మారుతుంది. ఆ తర్వాత సులభంగా 30 నిమిషాల నడక లక్ష్యాన్ని అందుకోవచ్చు.