కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ చేజిక్కించుకున్నాడు. దీంతో కెరీర్‌లో తొలి బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకొని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రణరు 21-19, 13-21, 21-18తో చైనాకు చెందిన వెంగ్ హంగ్ యాంగ్‌పై మూడుసెట్ల హోరాహోరీ పోరులో నెగ్గాడు. ఇరువురు షట్లర్లు ఫైనల్లో తలపడడం ఇదే ప్రథమం కాగా.. తొలి గేమ్‌లో వెంగ్.. ప్రణయ్ కు గట్టి పోటీనిచ్చాడు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ప్రణయ్10-11తో వెనుకబడ్డాడు. ఈ క్రమంలో చైనా షట్లర్ రాణించడంతో ప్రణయ్ 12-15 పాయింట్లతో వెనుకబడ్డాడు. ఆ తర్వాత ప్రణయ్ తన అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో రాణించి 21-19తో తొలి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో ప్రణయ్ వరుసగా పాయింట్లు చేజార్చుకోవడంతో 13-21తో ఆ గేమ్‌ను ప్రత్యర్ధికి కోల్పోయాడు. దీంతో తొలి రెండు గేమ్‌లు ముగిసే సరికి ఇరువురు షట్లర్లు ఒక్కో గేమ్‌లో విజయం సాధించడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ పోటా పోటీగా సాగింది. మూడో గేమ్‌లో ఇరువురు షట్లర్లు రక్షణాత్మకంగా ఆడడంతో ర్యాలీలు ఎక్కువయ్యాయి. తొలుత 5-7తో వెనుకబడ్డ ప్రణరు.. ఆ తర్వాత అర్ధభాగం ముగిసే సమయానికి 11-10తో ఒక్క పాయింట్ ఆధిక్యతలో నిలిచాడు. అదే క్రమంలో 14-11, 16-13పాయింట్లతో ప్రణయ్ ఆధిక్యతలోకి దూసుకెళ్లినా.. చైనా షట్లర్ ప్రణయ్ పై వరుసగా పాయింట్లు సాధించి ఓ దశలో 18-18పాయింట్లతో సమం చేశాడు. ఆ తర్వాత ప్రణయ్ రెండు ఫోర్ హ్యాండ్ స్మాష్‌లు సంధించి విజేతగా నిలిచాడు. దీంతో ప్రణయ్ ఆనందానికి అవధుల్లేకపోయాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న ప్రణయ్ ఈ టోర్నీ విజేతగా నిలవడంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కు దారి సుగమమం అయినట్లయ్యింది.










