Jun 19,2022 07:22

న్యూఢిల్లీ  :   భారత సాయుధ దళాల్లోని మూడు విభాగాలకు ఆఫీసరేతర నియామకాలన్నీ అగ్నిపథ్‌ ద్వారా జరుగుతాయని కేంద్రం ఈనెల 14న ప్రకటించింది. ప్రాథమికంగా రిక్రూట్‌మెంట్‌ క్రమాన్ని దెబ్బతీయడమే కాకుండా, సైనికుని స్వభావాన్ని కూడా దెబ్బతీసే ఈ చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తనకు గల కారణాలు చెబుతోంది. ఈ చర్యను దేశ రక్షణ రంగంలో మార్పులు తెచ్చే చర్యగా ఒక వర్గానికి చెందిన నిపుణులు ప్రశంసిస్తున్నారు. కానీ, రక్షణ రంగంలోని పలువురు నిపుణులు, రాజకీయ పరిశీలకులు మాత్రం తమ అభ్యంతరాలను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడానికి ఏ మాత్రమూ వెనుకాడడం లేదు.  సైన్యంలో చేరాలని భావించే యువత ఈ పథకాన్ని నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. చాలాచోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి కూడా. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుండి రిక్రూట్‌మెంట్‌ లేదు.  దాంతో యువత అంతా ఇప్పటికే తీవ్ర అసహనంతో వున్నారు. ఏదో ఒక మాదిరి చదువు, నైపుణ్యాలు కలిగిన వారు ఈ కొత్త రిక్రూట్‌మెంట్‌ క్రమం పట్ల తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు. దారిద్య్రం నుండి తాము తప్పించుకునే మార్గంగా ఇన్నాళ్లు చూసిన ప్రక్రియ నిలిచిపోతుందని భయపడుతున్నారు. ప్రస్తుతం సైన్యంలో చేరితే 15ఏళ్లకి పైగా సర్వీసు, తర్వాత జీవితాంతం పెన్షన్‌ వుంటుంది, దానికి భిన్నంగా కొత్తగా రిక్రూట్‌ అగ్నివీరులకు నాలుగేళ్ల కాలమే సర్వీసు వుంటుంది. అందులో ఆరు మాసాలు శిక్షణా కాలం. ఈ నాలుగేళ్లను పూర్తి చేసుకున్న తర్వాత, శాశ్వత కేడర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు. అందులో నాలుగోవంతు మందినే రెగ్యులర్‌ సైనికులుగా తీసుకుంటారు. మిగిలిన వారంతా వెళ్లిపోవాల్సి వుంటుంది. వెళ్ళే సమయంలో దాదాపు రూ.11.71 లక్షల మొత్తాన్ని అందజేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌ క్రమం 90రోజుల్లో ప్రారంభమవుతుంది. తొలిగా 46వేల మందిని తీసుకుంటారు.

ఈ కొత్త పథకం యువతతో కూడిన రక్షణ దళం రూపొందడానికి సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. మారుతున్న సాంకేతిక వాతావరణంలో మరింత శిక్షణ పొందిన సిబ్బంది వుంటారని పేర్కొంటోంది. పౌర సమాజంలోకి తిరిగివచ్చే వారు సైనిక క్రమశిక్షణతో, నైతిక విలువలతో, మరింత విలువతో కూడిన నైపుణ్యాలతో, మరిన్ని అవకాశాలను మెరుగుపరుచుకుంటారని చెబుతోంది. అంటే, ఇక మరో నాలుగేళ్ల పాటు సాయుధ దళాల్లోకి ఎలాంటి శాశ్వత రిక్రూట్‌మెంట్‌ వుండబోదని తేలుతోంది. పాలక బిజెపి నేతలతో సహా పలువురు విమర్శకులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న సంక్షోభాల నేపథ్యంలో సైనిక బలగాల నిర్వహణా సామర్ధ్యం దీనివల్ల బాగా దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కేవలం స్వల్ప కాలానికి రక్షణ సిబ్బందిని ఇలా తీసుకోవడం వల్ల, హడావిడిగా వారికి శిక్షణ ఇవ్వడం వల్ల ప్రొఫెషనల్‌ బలగాలకు వుండే సహచర సాంగత్యం కూడా కొరవడుతుందని అంటున్నారు. సైనికుడి విధులనేవి ఇలా కాంట్రాక్టు ఉపాధి కింద మారినట్లైతే ఉపాధి భద్రత, పెన్షన్‌, గౌరవం వంటి వాటిని ఆశించే వారికి సైన్యంలో చేరడమనేది స్ఫూర్తిదాయకంగా మారకపోవచ్చు. రక్షణ రంగాన్ని ఉపాధి హామీ పథకం కింద చూడరాదనే వాదన బాగుంది కానీ, వాస్తవానికి, ఆయుధాల తయారీ నుండి సైనికుల ఉపాధి వరకు ఈ రక్షణ రంగం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌ వంటి దేశానికి నిరుద్యోగమనేది ప్రధాన విధానపరమైన సవాలుగానే వుంటుంది. అందుకు సంబంధించిన ఆందోళనలు అంత సులభంగా తోసిపుచ్చలేం. ఇదంతా ఖర్చు తగ్గించుకోవడానికి వేసిన ప్రణాళిక తప్ప మరొకటి కాదని ప్రభుత్వం కూడా తీవ్ర ఆరోపణను ఎదుర్కొంటోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, కేంద్రం వెంటనే ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలుపుచేసి, రాజకీయ పార్టీలతో, విస్తృత రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి సమీక్షించాల్సి వుంది.