- ఛేదనలో బ్రూక్, క్రావ్లీ, వోక్స్ మెరుపుల్
- మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపు
- యాషెస్ సిరీస్‌పై ఆశలు సజీవం
లీడ్స్ (ఇంగ్లాండ్) : యాషెస్ సిరీస్ రెండో టెస్టులో 371 పరుగుల ఛేదనలో విజయానికి అత్యంత చేరువగా వచ్చిన ఇంగ్లాండ్.. దూకుడుగా ఆడినందుకు పశ్చాత్తాపం చెందలేదు. తర్వాతి టెస్టు లీడ్స్‌లో అంతకుమించిన దూకుడుతో బజ్‌బాల్ మెరుపుల్ మెరిపించి.. 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 251 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ తరఫున యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (75, 93 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీకి తోడు ఓపెనర్ జాక్ క్రావ్లీ (44, 55 బంతుల్లో 5 ఫోర్లు), క్రిస్ వోక్స్ (32 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు), మార్క్‌వుడ్ (16 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (5/78) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లతో పాటు బ్యాట్‌తో కీలక పాత్ర పోషించిన మార్క్‌వుడ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా యాషెస్ సిరీస్‌లో ఆ జట్టు 1-2తో నిలిచింది. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగా.. సిరీస్‌పై ఆతిథ్య జట్టు ఆశలు సజీవంగా నిలుపుకుంది. జులై 19 నుంచి మాంచెస్టర్‌లో యాషెస్ నాల్గో టెస్టు జరుగనుంది. ఆసీస్ నిర్దేశించిన 251 పరుగుల ఛేదనలో.. ఇంగ్లాండ్ మూడో రోజే 27/0 పరుగులు చేసింది. దీంతో నాల్గో రోజు ఉదయం సెషన్‌కు మరో 224 పరుగుల వేటకు బరిలోకి దిగింది. కానీ ఇంగ్లాండ్ బజ్‌బాల్ మంత్ర పఠించినా.. ఆసీస్ అంత సులువుగా పట్టు విడువలేదు. ఓపెనర్ జాక్ క్రావ్లీ (44), బెన్ డకెట్ (23) తొలి వికెట్‌కు 42 పరుగులతో శుభారంభం అందించారు. మోయిన్ అలీ (5), జో రూట్ (21) నిరాశపరిచారు. దీంతో 131/4తో ఇంగ్లాండ్ కాస్త ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (75) బాధ్యత తీసుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (13), జానీ బెయిర్‌స్టో (5)సైతం చేతులెత్తేయగా.. భారం అంతా బ్రూక్ మోశాడు. క్రిస్ వోక్స్ (32 నాటౌట్) జతగా కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఆరు ఫోర్లతో 67 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన బ్రూక్.. స్టార్క్ ఓవర్లో నిష్క్రమిం చటంతో కాస్త హైడ్రామాకు అవకాశం కనిపించింది. కానీ మార్క్‌వుడ్ (16 నాటౌట్) ఓ సిక్సర్, ఫోర్‌తో సమీకరణాలను మార్చివేశాడు. ఉత్కంఠను తొలగించి ఇంగ్లాండ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.










