Sep 13,2022 07:27

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : ఎనిమిది ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను త్వరలోనే ఉపసంహరించుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్‌ సిఇఒ పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగిన కోర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఆఫీసర్స్‌ సమావేశంలో వాటాల విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఎక్కువమంది సభ్యులు దీనికి సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రైతులపై తీవ్ర భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సిఎఫ్‌ఎల్‌), నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌), బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బివిఎఫ్‌సిఎల్‌), ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎసిటి), ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఇండియా (ఎఫ్‌సిఐఎల్‌), ఎఫ్‌సిఐ ఆరావళి జిప్సమ్‌ అండ్‌ మినరల్‌ (ఎఫ్‌ఎజిఎంఐఎల్‌), మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎంఎఫ్‌ఎల్‌), హిందుస్థాన్‌ ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎఫ్‌సిఎల్‌) సంస్థలను పెట్టుబడుల ఉపహంహరణకు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం.