- కొనసాగుతోన్న గోదావరి ఉధృతి
- రాజమహేంద్రవరంలోకి వరద నీరు
ప్రజాశక్తి- యంత్రాంగం : రోజులు గడుస్తున్నా గోదావరి పరివాహక ప్రాంతంలో భయానక వాతావరణం కొనసాగుతోంది. వరద ఉధృతి ఆదివారం కూడా కొనసాగడంతో బాధిత ప్రజలు సహాయశిబిరాల్లోనే రక్షణ పొందుతున్నారు. గోదావరి తీరంలోని అనేక గ్రామాల్లో ఇళ్లు నీటమునిగే కనపడుతున్నాయి. నడుంలోతు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో మరికొద్ది రోజుల పాటు వీరు శిబిరాల్లోనే తలదాచుకోక తప్పని స్థితి. భద్రాచలం వద్ద వరద ఆదివారం కొంత మేర తగ్గింది. అక్కడ వంతెనపై రాకపోకలకు అనుమతిచ్చారు. అదే సమయంలో పోలవరం,ధవళేశ్వరం వద్ద ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్లే వరద పెరగకపోవడంతో అధికారయంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకుంది. మరో ఒకటి రెండు రోజుల్లో వరద తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద 21 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీకి 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 24.59 లక్షల క్యూసెక్కులన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గత 24 గంటల్లో పది అడుగుల మేర వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం నుంచి దిగువకు 18.48 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు అప్పర్ స్పిల్ వే వద్ద 36.630 మీటర్లు, దిగువ స్పిల్‌వే వద్ద 28.56 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 15 గేట్ల ద్వారా దిగువకు 21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో, కాటన్ బ్యారేజీకి వద్దకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి వరద ఉధృతి కారణంగా మురుగు కాలువల్లోకి నీరు ఎగదన్నడంతో రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. పుష్కరఘాట్ పూర్తిగా నీట మునిగింది. ధవళేశ్వరంలోని సున్నంబట్టీ, వాడపేట, గొల్లపేటలోకి వరద నీరు వచ్చి చేరింది. సీతానగరం మండలంలో మునుకూడలిలో గోదావరి ఒడ్డున ఉన్న నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాజమహేంద్రవరంలోని రోడ్ కం రైల్ బ్రిడ్జిపై ఇతర భారీ వాహనాల రాకపోకలను ఆదివారం నుంచి అధికారులు నిలిపేశారు. నాలుగో బ్రిడ్జిపై నుంచి రాకపోకలకు అనుమతి కల్పించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోనూ రోడ్లు వరదతో నిండిపోయాయి.
బాధితులకు ఎన్ని కష్టాలో...!
సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులకు సైతం తప్పడం లేదు. ఏలూరు జల్లా కుక్కనూరు మండలంలోనూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ సిపిఎం బృందాలు ఆదివారం పర్యటించాయి. బాధితుల కష్టాలను తెలుసుకున్నాయి. 'కొద్దిపాటి బియ్యం, నాలుగు ఉల్లిపాయలు, నాలుగు దుంపలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. పిల్లలకు పాలుగానీ, బిస్కెట్లుగానీ, వంట నూనె, తాగునీరు వంటివి అందించడం లేదు. కనీసం భోజనం కూడా పెట్టలేదు' అంటూ కుక్కునూరు రైతు బజారు షెడ్‌లోని వరద బాధితులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బృందం ఎదుట వాపోయారు.
'బియ్యం మాత్రమే ఇస్తే మేము ఎలా వంట చేసుకుంటాం. మా వద్ద వంట గ్యాస్ లేదు' అంటూ ప్రయివేటు భవనంలోని సంజీవ నగర్ ఎస్‌సి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ వలంటీర్లు ఎవరూ తమ వద్దకు రావడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. కనీసం కొవ్వొత్తులు కూడా ఇవ్వలేదని చెప్పారు. రొక్కం మంగ, రొక్కం వెంకటలక్ష్మి, మాచర్ల రాజేశ్వరి మాట్లాడుతూ కట్టుబట్టలతో రోడ్డుమీద పడ్డామని, తమను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. గోదావరి వరద గురించి అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, సామగ్రిని అంతా అక్కడే వదిలేసి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడకు వచ్చామని చెప్పారు. కివ్వాక పునరావాస కేంద్రంలో బాధితురాలు ఏకోబితోపాటు పలువురు మాట్లాడుతూ 'మేము వచ్చి ఐదు రోజులైనా కనీసం తాగునీరు అందించడం లేదు. రేషన్ కార్డు చూపితేనే బియ్యం ఇచ్చారని తెలిపారు. కివ్వాకకు చెందిన 50 కుటుంబాలు పునరావాస కేంద్రానికి వచ్చినా ఇంకా వసతి, టార్పాలిన్లు కూడా ఇవ్వలేదని, వర్షంలోనే బరకాలు, చీరలు అడ్డుపెట్టుకునీ నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రామశింగవరం ఎస్‌సి కాలనీ, కస్తూరిబా బాలికల పాఠశాల వరద బాధితుల పరిస్థితి ఇలానే ఉంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు.










