- ఇకెవైసి, ఇ-క్రాప్‌లో కౌలు రైతులకు తొలగని ఇబ్బందులు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : భూమిని కౌలుకు చేస్తున్నా సాగు ధ్రువీకరణ పత్రం (సిసిఆర్‌సి) లేదనే పేరుతో కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందడం లేదు. ప్రధానంగా రైతు భరోసా, ఇ-క్రాప్ ద్వారా పంట కొనుగోలు, పంట నష్టపరిహారం, సబ్సిడీపై వివిధ రకాల పరికరాలకు దూరం అవుతున్నారు. తాజాగా ఈ నెల ఏడో తేదీలోగా పిఎం కిసాన్ పథకానికి ఇకెవైసి చేసుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. సాగు ధ్రువీకరణ పత్రం (సిసిఆర్‌సి) లేకపోవడంతో కౌలు రైతులు ఇకెవైసి చేసుకోలేక పోతున్నారు. భూ యజమానులకు తప్ప, కౌలు రైతులకు పిఎం కిసాన్, రైతు భరోసా అందడం లేదు. సిసిఆర్‌సి ఉన్న వారిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని, మిగతా వారికి వర్తించదని అధికారులు తెలిపారు. ఇ-క్రాప్ నమోదులో కౌలు రైతులను అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. సిసిఆర్‌సి లేదనే పేరుతో కౌలు రైతుల పేర్లను ఇ-క్రాప్‌లో నమోదుకు అంగీకరించడం లేదు. భూ యజమానుల పేర్లనే నమోదు చేస్తున్నారు. దీంతో, కౌలు రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించుకోలేకపోతున్నారు. వారికి కనీస మద్దతు ధర లభించడం లేదు. గుంటూరు జిల్లాలో 37,228 మంది కౌలు రైతులు ఉన్నట్లు లెక్కలు చూపి, వారిలో 16 వేల మందికి మాత్రమే సిసిఆర్‌సిలు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో 33,712 మంది కౌలు రైతులు ఉన్నట్లు పేర్కొని, వారిలో 26 వేల మందికి మాత్రమే సిసిఆర్‌సి పత్రాలు మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు జిల్లాల్లో దాదాపు ఆరు లక్షల మంది రైతులు ఉండగా, వారిలో రెండు లక్షల మంది కౌలు రైతులే. అయితే 71 వేల మందిని మాత్రమే కౌలు రైతులుగా అధికారులు గుర్తించారు. వారిలో 42 వేల మందికి సిసిఆర్‌సిలు ఇచ్చారు. ప్రభుత్వం గురించిన వారిలో 29 వేల మంది కౌలు రైతులు ఇ-క్రాప్ నమోదుతో పాటు ప్రభుత్వం అందిస్తోన్న వివిధ పథకాలకు దూరం అవుతున్నారు. వైసిపి ప్రభుత్వం 2019 కౌలు రైతుల చట్టం తెచ్చి భూ యజమాని అంగీకారాన్ని తప్పనిసరి చేసింది. అయితే, భూ యజమానులను ఒప్పించే బాధ్యతను అధికారులు తీసుకోవడం లేదు. ఇ-క్రాప్‌లో నమోదు కాకపోవడంతో కౌలు రైతులు సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా నష్టపరిహారం అందడం లేదు. భూ యజమానులకే పరిహారం అందుతోంది. వ్యయప్రయాసలకోర్చి ఆరుగాలం కష్టించి పండించిన కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు.
సెల్ఫ్ డిక్లరేషన్‌తో ఆమోదించాలి
సాగులో ఉన్న కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని వారి పేర్లను ఇ-క్రాప్‌లో నమోదు చేయాలి. వాస్తవ సాగుదారులను విస్మరించి భూయజమాని పేరు నమోదు చేయడం సరికాదు. కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులు వెంటనే జారీ చేయాలి.
- రాధాకృష్ణ, ఎపి కౌలు రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షులు










